vakatiనరేంద్ర మోడీ పక్కసీట్లో విమానయానం... చంద్రబాబునాయుడుతో హెలికాఫ్టర్‌ ప్రయాణం... అహ్మద్‌ పటేల్‌తో బ్రేక్‌ఫాస్ట్‌... గులాంనబీ ఆజాద్‌తో లంచ్‌... రాహుల్‌గాంధీతో డిన్నర్‌... సోనియాగాంధీతో కప్పు కాఫీ కుదిరితే నాలుగు మాటలు అన్నట్లుగా వ్యవహరించే శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణరెడ్డికి ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ అన్నీ సిబిఐతోనే జరిగిపోతున్నాయి. నేరం రుజువైతే అవన్నీ ఎక్కడ తినాల్నో వేరే చెప్పక్కర్లేదు. ఇంతకాలం నెల్లూరుజిల్లాకు ఒక లోటుండేది. విజయ్‌మాల్యా, సుబ్రతోరాయ్‌ వంటి ఆర్ధికనేరస్థులు ఒకరు కూడా జిల్లాలో లేరు. ఆర్ధిక నేరాలకు పాల్పడి సిబిఐ విచారణ ఎదుర్కొన్నవారు ఒక్కరూ లేరు. ఆ లోటును ఇప్పుడు వాకాటి నారాయణరెడ్డి తీర్చాడు.

నెల్లూరు వేదాయపాలెంలోని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిలో ఇటీవల సిబిఐ సోదాలు నిర్వహించడం జిల్లా రాజకీయాలలోనే సంచలనం సృష్టించింది. నెల్లూరుజిల్లా రాజకీయాలలో ఇంతవరకు ఏ నాయకుడి మీదా ఇలాంటి మచ్చలేదు. రాజకీయాలలో సంపాదించుకున్న నాయకులున్నారు, పోగొట్టుకున్న నాయకులు వున్నారు. అయితే బ్యాంకులకు వందలకోట్లు పంగనామాలు పెట్టి సిబిఐ కేసుల్లో ఇరుక్కున్న నాయకుడు లేడు. జిల్లా రాజకీయ చరిత్రలో సిబిఐ స్థాయి ఆర్ధిక నేరస్థుడిగా నిలిచిన ఖ్యాతి వాకాటిదే అయ్యింది. వాకాటికి పలు కంపెనీలున్నాయి. ఈ కంపెనీల పేరుతో ఆయా బ్యాంకుల్లో ఋణాలు వందలకోట్లలోనే వున్నాయి. ఓ పక్క పారిశ్రామికవేత్తగా, కాంట్రాక్టర్‌గా వుంటూనే ఇంకోపక్క మూడేళ్ళ క్రితం వరకు కూడా కాంగ్రెస్‌పార్టీలో కొనసాగాడు. జిల్లాలో నేదురుమల్లికి ముఖ్య అనుచరుడిగా నడుచుకున్నాడు. వాకాటికి బిజినెస్‌ తక్కువ బిల్డప్‌ ఎక్కువ అనే పేరుంది. బ్యాంకుల నుండి తీసుకున్న వందలకోట్ల ఋణాలను వ్యాపార అవసరాలకంటే కూడా బిల్డప్‌ పనులకే ఎక్కువుగా ఖర్చు పెట్టేవాడు. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డికే ఢిల్లీలో రోజూ ఏం పని వుండదు. కాని వాకాటి మాత్రం ప్రతిరోజూ ఢిల్లీలో వుండేవాడు. అక్కడ ఏం చేసేవాడో, ఎవరిని కలిసేవాడో ఎవరికీ తెలియదు గాని, ఆయన మాత్రం పొద్దస్త మానం అహ్మద్‌పటేల్‌, గులాంనబీ ఆజాద్‌, చిదంబరంలతోనే తిరుగుతున్నట్లు చెప్పు కునేవాడు. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి మరణించడం, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ కూడా మరణించడం, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుండి నెల్లూరు పార్లమెంట్‌కు పోటీ చేస్తే డిపాజిట్‌ కూడా రాకపోవడం... ఇత్యాది కారణాలతో వాకాటి ఆ తర్వాత కాలంలో తెలుగుదేశంలో చేరాడు. మొన్ననే తెలుగుదేశం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టిక్కెట్‌ను తెచ్చుకుని గెలిచాడు. నారా లోకేష్‌ను గట్టిగా పట్టడంతో వాకాటికి ఎమ్మెల్సీ సీటొచ్చింది. ఈయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చేనాటికే ఆయన బ్యాంకులకు వందలకోట్లు బకాయిలున్నాడని, బ్యాంకులు ఆయనకు నోటీసులు జారీ చేసాయనే విషయం కూడా చంద్రబాబుకు తెలుసు. వాకాటి బ్యాంకు బకాయిలపై మీడియాలో కూడా పెద్దఎత్తున కథనాలు వచ్చాయి. అయినా ఆరోజు లెక్కలు ఆరోజుకే అన్నట్లు చంద్రబాబు వాకాటికే ఎమ్మెల్సీ సీటిచ్చాడు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వాకాటి బ్యాంకుల నుండి 40కోట్ల రూపాయలు డ్రా చేసి ఖర్చుపెట్టడం అతని మెడకే ఉచ్చులా తగులుకుంది. ఓ పక్క బ్యాంకుల బకాయిలు చెల్లించకుండా బ్యాంకుల నుండి 40కోట్లు ఎలా డ్రా చేస్తారంటూ భారత పారిశ్రామిక ఆర్ధిక సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు సిబిఐ ఆయన మీద కేసు నమోదు చేసింది. ఈమేరకే నెల్లూరులో ఆయన నివాసంలో సిబిఐ సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా వాకాటి బ్యాంకుల నుండి ఋణం తీసుకునే సమయంలో గ్యారంటీగా పెట్టిన ఆస్తుల విలువను పెంచి చూపించాడని, ఉద్దేశ్య పూర్వకంగానే బ్యాంకులను మోసం చేసాడని భారత పారిశ్రామిక ఆర్ధిక సంస్థ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇది నిజమే. వాకాటి బ్యాంకులకు తనఖాగా తన భూములను ఎక్కువుగా పెట్టాడు. వాస్తవంగా వున్న వాటి విలువకంటే అధిక రేట్లకు రిజిష్టర్‌ చేయించి వాటిని బ్యాంకులకు తాకట్టుగా పెట్టాడని సమాచారం. ఈరోజు అసలు, వడ్డీలు అన్నీ కలిపితే అన్ని బ్యాంకులకు కలిపి ఆయన బాకీపడ్డ మొత్తం వెయ్యికోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. వాకాటి బ్యాంకులకు తాకట్టు పెట్టిన ఆస్తుల విలువ అందులో పదోవంతు కూడా వుండదు. బ్యాంకు బకాయిలను తీర్చడం వాకాటికి ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. కేవలం బ్యాంకు అప్పుల నుండి బయటపడడానికే ఆయన చంద్రబాబుకు మోకరిల్లాడు.

అయితే చంద్రబాబు, వై.యస్‌.రాజశేఖరరెడ్డి లాంటి వాడు కాదు. తప్పుడు మనిషి అని తెలిస్తే వై.యస్‌. దగ్గరకు రానీయడు. తెలియక తప్పు చేసాడని తెలిస్తే కాపాడడానికి వెనుకాడడు. బ్యాంకులకు వాకాటి వందల కోట్లు బకాయిలు వున్నాడని తెలిసినా చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నాడు. ఎమ్మెల్సీ సీటు కూడా ఇచ్చాడు. అతని మీద సిబిఐ కేసు నమోదు చేసిందనగానే ఎటువంటి ముందస్తు నోటీసుగాని, విచారణ గాని లేకుండా వాకాటిని పార్టీ నుండి సస్పెండ్‌ చేశాడు. వాకాటి బురద తనకెక్కడ అంటు కుంటుందోననే భయంతోనే ఆయన ఈ పని చేశాడు.

మరి వీళ్ళ సంగతేంటి?

వాకాటి మీద సిబిఐ కేసు నమోదు చేసిందని చంద్రబాబు ఆయనను పార్టీ నుండి సస్పెండ్‌ చేశాడు. బాగానే వుంది. మరి మారిషస్‌ బ్యాంకులకు వేల కోట్ల టోపీ పెట్టి అరెస్ట్‌ వారెంట్‌ కూడా జారీ అయి వున్న కేంద్రమంత్రి సుజనాచౌదరి పరిస్థితి ఏంటి? ఆయన మీద ఏ చర్యా లేకపోగా అదనంగా కేంద్రమంత్రి పదవిలో కూడా వున్నాడు. తెలుగుదేశం జమానాలోనే రాయపాటి సాంబశివరావు, నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్‌, గంటా శ్రీనివాసరావులు బ్యాంకులకు వేలకోట్లు అప్పులున్నారు. మరి వీళ్లను సస్పెండ్‌ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? పార్టీలో వాకాటి కొక న్యాయం? మిగిలిన బ్యాంకు ఎగవేతదార్లకు ఒక న్యాయమా? అనే ప్రశ్న కూడా పార్టీ కార్యకర్తల్లోనే వ్యక్త మవుతోంది. మొత్తానికి వాకాటి ఎపిసోడ్‌ కీలక దశకు చేరుకుంది. ఒక నాయకుడు సిబిఐ చేతిలో పడ్డాడంటే అది అతని ప్రాభవానికి ఆరంభమైనా కావాలి, లేదా అంతమైనా కావాలి. ఎప్పుడూ ఢిల్లీ స్థాయిలోనే మాట్లాడే వాకాటిని అదే స్థాయికి తగ్గ కేసు పట్టుకుంది. ఆయన ఆర్ధిక నేరాలను సిఐడి, ఇంటలిజన్స్‌ వంటి సంస్థల చేత విచారణ చేయిస్తే ఆయనకు అది చిన్నతనం కూడా! వాకాటి బిల్డప్‌కు తగ్గట్లుగానే ఆయన ఆర్ధిక నేరంపై సిబిఐ కేసు విచారణ చేపట్టడం వాకాటి స్థాయిని పెంచేదే!

vakatiనెల్లూరుజిల్లా స్థానిక సంస్థల శాసనమండలి నియోజక వర్గ తెలుగుదేశం అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డినే కొనసాగించే అవకాశాలు ఎక్కువుగా వున్నాయి. దీనికి ఆయనకున్న ప్రధాన అర్హత 2014లో తెలుగు దేశంపార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ నుండి జంప్‌ చేసి ఇక్కడకు రావడమే! ఏళ్ల తరబడి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని, ఆ పార్టీ జెండాలు మోసిన నాయకులకు పదవులు ఇచ్చే పద్ధతిని పూర్తిగా పక్కనపెట్టేసాడు చంద్రబాబు. ఏళ్ల తరబడి పార్టీని మోస్తున్న వాళ్లు ఆ పనినే చిత్తశుద్ధితో చేయాలి, ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్లు మాత్రం పల్లకీ ఎక్కాలి... తెలుగుదేశంలో ప్రస్తుతం జరిగేది ఇదే! ఈ కోవలోనే పార్టీలో ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఎందరో సీనియర్‌ నాయకులు, పార్టీ కోసం సొంత డబ్బులు కోట్లు తగలేసుకుని చేతులు కాల్చుకున్న నాయకులున్నా, వారిని కాదని వాకాటికే ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. వాకాటి పార్టీలో చేరేటప్పుడే ఈ ఒప్పందం మీద చేరాడని సమాచారం.

ముఖ్యంగా వాకాటి, చంద్రబాబుకు కుడిభుజం లాంటి మంత్రి నారాయణను పట్టుకున్నాడు. నారాయణ చొరవ మూలంగానే వాకాటి పార్టీలో చేరాడు. సూళ్లూరుపేటకు చెందిన మరో పారిశ్రామికవేత్త, తెలుగుదేశం నేత గంగాప్రసాద్‌తోనూ వాకాటికి సన్నిహిత సంబంధాలున్నాయి. వాకాటి కోసం నారాయణ, గంగా ప్రసాద్‌లు బలంగా ప్రయత్నిస్తే సీటు రాకుండా పోతుందా?

vakatiనెల్లూరుజిల్లా ప్రజలకు షాక్‌లాంటి వార్త ఇది. ఎప్పుడు చూసినా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ రాహుల్‌గాంధీతో, మధ్యాహ్నం లంచ్‌ సోనియా గాంధీతో, సాయంత్రం డిన్నర్‌ అహ్మద్‌పటేల్‌తో చేసానని చెప్పుకునే శాసనమండలి సభ్యులు, పారిశ్రామికవేత్త కూడా అయిన వాకాటి నారాయణరెడ్డి కూడా వివిధ బ్యాంకుల్లో 1098కోట్లు బకాయిలు కట్టాలి. మొత్తం బ్యాంకుల నుండి ఆయన 1538కోట్లు ఋణంగా తీసుకోగా 400 కోట్ల పైనే చెల్లించారు. మిగిలిన బకాయిలు కట్టాలి. గత కొన్నేళ్లుగా బకాయిలు కట్టక పోతుండడంతో బ్యాంకులు ఆయనకు నోటీసులు కూడా జారీ చేశాయి. ఒకప్పుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి అను చరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కాంగ్రెస్‌పార్టీలో పలు పదవులు నిర్వహించారు. నెల్లూరుజిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌గా పనిచేసి, ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆయన ఎన్నికల తర్వాత అధికార తెలుగుదేశంలో చేరి, చంద్రబాబుకు ఆసాంతం చెక్కభజన చేస్తున్నారు.

ఇది రాజకీయ కోణమైతే పారిశ్రామికవేత్తగా, కాంట్రాక్టర్‌గా, వ్యాపారవేత్తగా పలుకోణాలున్నాయి. విఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రా, విఎన్‌ఆర్‌ రైల్‌ కంపెనీ, విఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌... వంటి పేర్లతో పలు కంపెనీ లను పెట్టి కొన్నింటిలో మేనేజింగ్‌ డైరెక్టర్‌గానూ, మరికొన్నింటిలో డైరక్టర్‌గానూ కొనసాగుతున్నారు. వ్యాపార కార్యకలాపాల కోసంగా బ్యాంకుల నుండి 1538 కోట్లు ఋణం తీసుకున్నాడు. ఈరోజు 1098కోట్లు బ్యాంకులకు కట్టాలి. బ్యాంకులకు టోపీ పెట్టే రాజకీయ గద్దల జాబితాలో ఆయన కూడా ఒకడయ్యాడు. నెల్లూరుజిల్లా చరిత్రలో ఇదే పెద్ద అక్రమం. జిల్లాలో మాగుంట, వేమిరెడ్డి, ఎన్‌డిఆర్‌ వంటి పారిశ్రామిక దిగ్గజాలెందరో వున్నారు. వీరి బ్యాంకు లావాదేవీలన్నీ సజావుగా సాగుతున్నాయి. ఒక్క వాకాటి బ్యాంకులకు నిలువునా బకాయిపడ్డాడు. వెయ్యి కోట్లంటే మాటలా... ఎందరి రక్తమిది. ఎందరి స్వేదమిది. ఎందరి శ్రమ ఫలితమిది. పేదలు, మధ్యతరగతి ప్రజలను పీల్చి పిప్పిచేసి దండిన డబ్బులను ఇలా రాజకీయ రాబందుల పాలు చేస్తున్నారు. బ్యాంకులకు వేలకోట్లలో టోపీలు పెట్టిన వాళ్లంతా అధికారపార్టీల ఆశ్రయం పొందుతున్నారు. ఇలా అయితే ఈ ఆర్ధిక వ్యవస్థ నిలిచేదెట్లా? బ్యాంకింగ్‌ వ్యవస్థ మనుగడ సాగించేదెలా?

వాకాటి అప్పుల ఎగవేతపై టివి9 బిజినెస్‌ న్యూస్‌లోనూ పెద్ద కథనమే వచ్చింది. దీనిపై ఆర్ధిక మేధావుల చర్చా కార్యక్రమం జరగగా, ఇలాంటి పొలిటికల్‌ ఎగవేతలపై వాళ్ళు తీవ్రంగానే విరుచుకుపడ్డారు. టివి9లో వార్త రాగానే వాకాటి నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని టివి9 ప్రధాన కార్యాలయంలోకి వెళ్లి వాళ్ళను బ్రతిమలాడుకుని ఆ వార్తను ఆపుచేయించడమే కాకుండా, యూట్యూబ్‌లోనూ ఆ వార్తలకు సంబంధించిన చిత్రాలను తీసేయించగలిగాడు.

టీవీలలో, పేపర్లలో వార్తలు రాకుండా ఆపినంత మాత్రాన వాకాటి ప్రిస్టేజీ నిలబడేది ఏమీ లేదు. కాని తీసుకున్న అప్పులను సరిగా కడితే ఈ ప్రయాస ఉండేది కాదుకదా!

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
  నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…
 • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
  ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…

Newsletter