majeeఇప్పుడు నెల్లూరు, తిరుపతి లోక్‌సభ నియోజక వర్గాల ప్రజలకు ఎంపీలు లేరు. ఉన్న ఇద్దరూ మాజీలయ్యారు.

ప్రత్యేకహోదా పోరాటంలో భాగంగా ప్రతి పక్ష వైకాపాకు చెందిన ఐదు మంది ఎంపీలు గత నెలలో రాజీనామాలు చేయడం తెలిసిందే! ఎంపీలు వరప్రసాద్‌, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వై.యస్‌.అవినాష్‌రెడ్డి, మిధున్‌రెడ్డిలు తమ రాజీనామాపత్రాలను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు అందజేయడం జరిగింది. ఈ రాజీనామాలను డ్రామాలని స్పీకర్‌ వీటిని ఆమోదించరని, ఈ ఐదు లోక్‌సభలకు ఉపఎన్నికలు రావని అధికార తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది. లోక్‌సభ స్పీకర్‌ కూడా ఇవి భావోద్రేకాలతో చేసిన రాజీనామాలని, కొంచెం ఆలోచించుకోండంటూ రాజీనామా చేసిన ఎంపీలకు గడువిచ్చింది. ఈ విషయంలో తాము వెనక్కు తగ్గేది లేదని వైసిపి ఎంపీలు మరోసారి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి స్పష్టం చేయడంతో ఎట్టకేలకు వీరి రాజీనామాలను ఆమె ఆమోదించింది. దీంతో మన జిల్లా పరిధిలోని నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వి.వరప్రసాద్‌లు మాజీలయ్యారు. ఏడాదిలోపే లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సివుంది. ఈలోపు ముందస్తు ఎన్నికలు వచ్చినా రావచ్చు. కాబట్టి ఈ స్థానాలకు ఉపఎన్నికలు జరగడం అనుమానమే!

mpsనెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న అసంతృప్తిని, వ్యతిరేకతను చాలావరకు తగ్గించుకోగలిగారు.

ప్రత్యేకహోదా ఉద్యమంలో భాగంగా వైకాపాకు చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు రాజీనామా చేయడం, వెనువెంటనే ఆంధ్రాభవన్‌ వద్ద నిరాహారదీక్షకు కూర్చోవడం జరిగింది. ఈ ఐదుగురిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి వయసులో పెద్దోడు. 73ఏళ్ళు. ఆ వయసులో నిరాహారదీక్ష వంటివి ఆయన ఒంటికి పడవు. అయినా పట్టుదలగా కూర్చున్నాడు. రెండోరోజే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పోలీసులు అరెస్ట్‌ చేసి ఆసుపత్రికి తరలించారు. ఈ వయసులో కూడా ఆయన నిరాహారదీక్షకు కూర్చోవడం, జగన్‌ మాటకు కట్టుబడి రాజీనామా చేయడం వంటివన్నీ ఆయనపై ప్రజల్లో వున్న వ్యతిరేకతను చాలావరకు తగ్గించాయని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో సిటింగ్‌ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుండింది. కాబట్టే భారీ క్రాస్‌ఓటింగ్‌ జరిగి, లోక్‌సభ పరిధిలోని 7అసెంబ్లీలలో 5 నియోజకవర్గా లలో వైసిపి అభ్యర్థులు గెలిచినా ఈయన కేవలం 13వేల ఓట్లు మెజార్టీతో గెలిచాడు. వ్యతిరేకత లేకుంటే దాదాపు లక్ష ఓట్లు మెజార్టీ వుండాలి. రాబోయే ఎన్నికల్లో ఆయనపై అంతటి వ్యతిరేకత రాకపోవచ్చు. క్రాస్‌ఓటింగ్‌కు ఈసారి ఆస్కారం వుండదు.

తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ మీద ఇటీవలకాలం వరకు ఆయన నియోజకవర్గ పరిధిలో వ్యతిరేకత వుండింది. వైసిపిలో కూడా కొంతమంది నాయకులు ఆయనపై అసంతృప్తితో వున్నారు. అయితే ఇటీవల ప్రత్యేకహోదా విషయంలో వరప్రసాద్‌ చురుకైన పాత్ర పోషించాడు. లోక్‌సభలో దీనిపై ప్రభుత్వాన్ని కదిలించేలా ప్రసంగిం చాడు. వైసిపి ఎంపీలలో మేకపాటి తర్వాత వయసులో ఆయనే పెద్దోడు. ఆ వయసు లోనూ దీక్షకు కూర్చుని పోరాడాడు. ఏదేమైనా ఈ ఇద్దరు ఎంపీలకు ప్రత్యేకహోదా ఉద్యమం ఒక ఆక్సిజన్‌లాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు.

dugrajమొన్నటిదాకా దుగరాజపట్నం పోర్టు సాధిస్తానంటూ మాజీఎంపీ చింతా మోహన్‌ కలరింగ్‌ ఇచ్చాడు. ఈమధ్య ఆయన సైలంట్‌ అయ్యాడు. తాజాగా తిరుపతి ఎంపి వెలగపూడి వరప్రసాదరావు పోర్టు పాటందుకున్నాడు. పోర్టు సాధన కోసమంటూ మొన్న ఒకరోజు దుగరాజపట్నంలో దీక్ష కూడా చేశాడు. కాని, దుగరాజపట్నం పోర్టు అన్నది కేంద్రప్రభుత్వం చించేసిన చీటీ! ఈ ఫైల్‌ను పక్కనపడేసింది. ఇస్రో, పర్యాటక శాఖ అభ్యంతరాలతో పాటు ఇక్కడ పోర్టు పెట్టినా పెద్దగా లాభముండదని సర్వే నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పోర్టు ఫైల్‌ను అటకెక్కించారు.

జిల్లాలో కృష్ణపట్నం పోర్టు వుంది. మొత్తం 41 బెర్త్‌ల నిర్మాణం లక్ష్యం. ఇప్పటికి 13 బెర్త్‌లు పూర్తయ్యాయి. ఆ పూర్తయిన బెర్త్‌లకే సరిగా వ్యాపారం లేదు. బళ్లారి, అనంతపురంల నుండి ముడి ఇనుపఖనిజం రవాణా ఆగిపోవడం పోర్టుకు పెద్ద షాక్‌. ఇటీవల విద్యుత్‌ ప్రాజెక్ట్‌లు కూడా అంతంత మాత్రంగా వున్నాయి. విదేశాల నుండి బొగ్గు దిగుమతులు కష్టంగా వున్నాయి. పోర్టుకు ఈ రెండూ ప్రధాన ఆధారం. ఆ రెండూ ఆగిపోయాయి. ఇటీవల గ్రానైట్‌, యూరియా, కంటైనర్‌ వ్యాపారం పెరగబట్టి సరిపోయింది. లేకుంటే పోర్టులో కట్టి వున్న ఆ బెర్త్‌లు కూడా ఖాళీగానే వుండేవి. జిల్లాలోకి కొత్తగా భారీ పరిశ్రమలు వస్తే పోర్టుకు వ్యాపారం ఉంటుంది. ఎగుమతులు, దిగుమతులు ఉంటాయి. పరిశ్రమలు పెద్దసంఖ్యలో వచ్చి ఎగుమతులు, దిగుమతులు ఎక్కువై ఇప్పుడున్న పోర్టు సరిపోకపోతే జిల్లాలో ఇంకో పోర్టుకు అవకాశముంటుంది. జిల్లాలో గత 5ఏళ్ల నుండి ఒక్క పరిశ్రమ లేదు. పారిశ్రామికంగా ఎలాంటి అభివృద్ధి లేదు. అలాంటప్పుడు పోర్టులు కట్టుకొని ఏం లాభం. బస్సులు రాని ఊరిలో బస్టాండ్‌ కట్టినట్లుగా వుంటుంది.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ప్రశాంతతే.. మా లక్ష్యం!
    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నిందితులను ఇక నుండి వీడియో కెమెరాల ముందు ప్రవేశపెట్టబోమని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. మనుబోలు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఈనెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాను…
  • నెల్లూరు పోలీస్‌ కార్యాలయాలకు హైటెక్‌ సొగసులు
    మనం హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లు చూసినప్పుడు... ఇలాంటి పోలీసుస్టేషన్‌లు మనకు కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటాం... ఎందుకంటే అవి పోలీసుస్టేషన్‌ల మాదిరిగా వుండవు. కార్పొరేట్‌ కంపెనీల ఆఫీసుల్లాగా వుంటాయి. ఈమధ్య ఉత్తమ పోలీసుస్టేషన్‌గా కూడా…
  • రాజకీయ దారులు వేరవుతాయా?
    నెల్లూరుజిల్లా రాజకీయాలంటే అగ్రవర్ణ నాయకులదే పెత్తనం. బెజవాడ, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు బలంగా వున్న ఈ జిల్లాలో ఓ దళిత మహిళ 5సార్లు వరుసగా నెల్లూరు లోక్‌సభ టిక్కెట్‌ తెచ్చు కుని అందులో నాలుగుసార్లు…
  • 2019... రేస్‌ గురాల్రు వీళ్ళే!
    ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తుంటాయి. అలాగే ప్రతి ఎన్నికలకు కొందరు కొత్త నాయకులు వస్తుంటారు. కొందరు నాయకులు తెరమరుగవుతుంటారు. ప్రతి ఎలక్షన్‌ ఎంతోకొంతమంది కొత్తవారిని మనకందిస్తూనేవుంటుంది. 2014 ఎలక్షన్‌ ఇలాంటిదే! ఆ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలుగా…
  • ఆనంతో... అదనపు బలం!
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి…

Newsletter