venkaiahరాజకీయాలలో ఉంటే పక్కా రాజకీయ నాయకుడిలా వ్యవహరిం చాలి. రాజ్యాంగ పదవుల్లో వుంటే రాజ్యాంగ పరిరక్షకుడిగా నడుచు కోవాలి. నాలుగు నెలల క్రితం రాజ కీయ నాయకుడి నుండి రాజ్యాంగ పరి రక్షకుడిగా మారిన భారత ఉపరాష్ట్ర పతి యం.వెంకయ్యనాయుడు అదేపని చేశాడు.

రాజ్యసభ ఛైర్మెన్‌ హోదాలో రాజ్యాంగ విలువలను కాపాడేలా ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేస్తూ దళ్‌(యు) సభ్యులైన శరద్‌యాదవ్‌, ఆలీ అన్వర్‌ అన్సారీల రాజ్యసభ సభ్యత్వాలను రద్దు చేశారు. బీహార్‌లో దళ్‌(యు) ఆర్జేడీల మధ్య పొత్తు విచ్ఛినమై, దళ్‌(యు) బీజేపీతో జత కట్టడం తెలిసిందే! అయితే శరద్‌యాదవ్‌, ఆలీఅన్వర్‌ అన్సారీలు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి వేరుగా ఉండిపోయారు. దీంతో దళ్‌(యు) నాయకత్వం వీరిద్దరి మీద చర్య తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మెన్‌ను కోరింది. ఈ నేపథ్యంలోనే వారిద్దరిపై వేటు వేస్తూ వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఆయన ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రా, తెలంగాణ శాసనసభాధిపతులకు చెంపపెట్టు వంటివనే చెప్పవచ్చు. చట్టసభల సభ్యుల పార్టీ ఫిరాయింపు కేసుల్లో సభాపతులు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ క్రింద సభ్యుల అనర్హతపై దాఖలు చేసిన పిటిషన్లపై సకాలంలో నిర్ణయం తీసుకోవాలి. అలా కొందరు సభాపతులు నిర్ణయం తీసుకోకపోతుండడం వల్లే వారి తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పిటిషన్లపై నిర్ణయం తీసుకునే విషయంలో సభాపతులు అనవసర కాలయాపన చేస్తున్నారని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. సభాపతులు ఇలాంటి పిటిషన్‌లను ఎంతోకాలం నానబెట్టడం మంచిది కాదు. పార్టీ ఫిరాయించిన సభ్యులకు చట్టప్రకారం వాదన చెప్పుకునే అవకాశం కల్పించి మూడు నెలల్లో సభాపతులు నిర్ణయం తీసుకోవాలి. ఇవీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పిన ఆణిముత్యాలు... నిన్నటిదాకా ఆయనా రాజకీయనాయకుడే! తెలుగుదేశంకు మిత్రపక్ష సభ్యుడే... ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడే! ఆయన నుండి తెలుగుదేశం వాళ్ళు ఏం నేర్చుకున్నారు? మూడున్నరేళ్ళుగా రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల పర్వం జరుగుతోంది. వైకాపాకు చెందిన ముగ్గురు ఎంపీలను, 22మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశంలో చేర్చుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం క్రింద వారిపై చర్యలు తీసుకోవాలని వైసిపి పిటిషన్‌లు వేసింది. ఏపి శాసనసభాపతి నుండి ఉలుకు పలుకు లేదు. అంతెందుకు లోక్‌సభలో కూడా పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎంపీలపై ఇంతవరకు చర్యలు లేవు. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాజ్యసభలో ఒక నీతి

ఉంటే ఆయా రాష్ట్రాలలో ఇంకో నీతి ఉంటుందా?

దళ్‌(యు) సభ్యులన్నా పార్టీని వీడిపోలేదు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారంతే! కాని ముగ్గురు ఎంపీలు, 22మంది ఎమ్మెల్యేలు వైసిపి గుర్తు మీద గెలిచి, పార్టీ ఫిరాయించారు. అలాంటి ఫిరాయింపుదారుల మీద చర్యలు తీసుకోకపోతే రాజ్యాంగానికి విలువలేదు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి గౌరవం లేదు. మన సభాపతులు వెంకయ్యనాయుడును చూసైనా మారితే రాజకీయాలలో కొంతవరకన్నా విలువలను కాపాడినవారవుతారు.

venkaiahభారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసాక మొదటిసారిగా నెల్లూరు ముద్దుబిడ్డ ముప్పవరపు వెంకయ్యనాయుడు 4వ తేదీ నెల్లూరుజిల్లా పర్యటనకు విచ్చేసారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక ఆగస్టు 5వ తేదీ నెల్లూరులో జరిగిన 'మన వెంక్యయకు ఆత్మీయ అభినందన' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సరిగ్గా రెండు నెలల తర్వాత మళ్ళీ నెల్లూరొచ్చారు. విజయవాడ నుండి విమానంలో తిరుపతిలో దిగి, అక్కడనుండి ఎయిర్‌ఫోర్స్‌ హెలికాఫ్టర్‌లో శ్రీహరికోటలోని షార్‌సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ జరిగిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడనుండి హెలికాఫ్టర్‌లో వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో దిగారు. అక్షర విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గాన నెల్లూరుకు చేరుకున్నారు. కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 49వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా వ్యవసాయ శాస్త్రాన్ని విద్యగా స్వీకరించిన విద్యార్థులను అభినందించారు. మీ జీవితంలో ఇదొక మధురజ్ఞాపకం. డిగ్రీలో పట్టా పొందిన సమయంలో నేను కూడా ఇలాంటి ఆనందాన్నే అనుభవిం చాను. దేశానికి వెన్నెముకలాంటి వ్యవసాయ శాస్త్రాన్ని మీరు అభ్యసిం చారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయ రంగం పాత్రే కీలకం. గ్రామీణ ప్రాంత జీవనాధారమంతా కూడా ఇప్పటికీ వ్యవసాయం మీదనే ఆధారపడి వుంది. వ్యవసాయం లాభసాటిగా లేదని నిరాశ, నిస్పృహలతో రైతులు వ్యవసాయాన్ని వదిలి వేస్తున్నారు. యాక్టర్‌ కొడుకు యాక్టర్‌, డాక్టర్‌ కొడుకు డాక్టర్‌, కలెక్టర్‌ కొడుకు కలెక్టర్‌ కావాలని చూసుకుంటున్నారు. ఫార్మర్‌ మాత్రం తన కొడుకును ఫార్మర్‌ చేయాలనుకోవడం లేదు. కాని వ్యవసాయానికి విలువ తెచ్చి రైతాంగానికి వన్నె తెచ్చి నప్పుడు, ఒక రైతు తన కొడుకును కూడా రైతును చేయాలనుకుంటాడు. దేశంలో 64శాతం మంది వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తున్నారు. గ్రామీణ స్థూల

ఉత్పత్తిని 39 శాతం సాధించడం జరి గింది. వ్యవసాయ అనుబంధ రంగాలు మన జాతీయ సంస్థల ఉత్పత్తి వృద్ధికి అధికశాతం దోహదపడుతున్నాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంలో పట్టభద్రు లైనవారు, శాస్త్రవేత్తలు రైతులు అధిక దిగుబడి పొందేలాగా రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తుండాలని తెలిపారు. దేశంలో ఏ రైతు కూడా వ్యవసాయంతో పాటు పౌల్ట్రి, డెయిరీ, తదితర అనుబంధ వ్యాపారాలతో అభివృద్ధి చెందుతున్నారని ఒక సర్వే ద్వారా వెల్లడైం దని, కృషి విజ్ఞాన కేంద్రం రైతులకి ఒక నాలెడ్జ్‌ హబ్‌ అని సూచించారు. 2022 నాటికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేలాగా చర్యలు తీసుకోవడంలో ముందంజలో వున్నాయన్నారు.

మౌలిక వసతుల కల్పనలో భాగంగా గ్రామాలకు రోడ్లు, విద్యుత్‌, గోదాములు, మార్కెట్‌ యార్డులు నెలకొల్పడమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. దేశానికి ప్రాజెక్టులు ఎంతో అవసరమని, పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదన్నారు. సాధించిన విజయాలకన్నా, సాధించవలసినవి ఎన్నో వున్నాయన్నారు. ఆచార్య ఎన్‌.జి. రంగా విశ్వ విద్యాలయ 49వ స్నాతకోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకమని, డాక్టరేట్‌ పట్టాలు, బహుమతులు పొందిన వారికి తన అభినందనలు తెలియజేశారు. గ్రామాల నుండి నగరానికి వలస పోతున్న సంఖ్యను తగ్గించి, నగరాల నుండి గ్రామా లకు మార్పు చెందేలా గాంధీజీ సూచించిన బ్యాక్‌ టు విలేజ్‌కి అందరూ సహకరించాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ మరియు విశ్వవిద్యాలయ కులపతి ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ మాట్లాడుతూ విద్య అన్నది ధనార్జనకు సంబంధించిన ముఖ్యమైన వనరు కాదని, విద్య అన్నది ఒక సేవ అని, వ్యవసాయ విశ్వవిద్యాలయం అన్నది విద్యార్థులకు ధనార్జనకు ఉపయోగపడే సాధనం కాదని ఆయన అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదలలో నీటి వినియోగాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం వుందన్నారు.

ఉదాహరణకు డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా భవిష్యత్తులో భూగర్భ జలాలు దృష్టిలో వుంచుకుని నీటిని విని యోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయి వేటు విద్యాసంస్థలు వారి వ్యాపారధోరణి మార్చు కోవాలని కాలానుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడు తున్న సంస్కరణలను అమలుపరచి సత్ఫలితాలు పొందాలన్నారు. విద్యను ధనార్జనగా మారుస్తూ, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయని విద్యాసంస్థలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి దామోదరనాయుడు, రిజిస్ట్రార్‌ టి.వి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

దేశానికి గర్వకారణం.. ఇస్రో

మనదేశానికి ఇస్రో గర్వకారణమని.. భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభినందించారు. భారత అంతరిక్ష పరిశోధనలకు విక్రమ్‌సారాభాయ్‌ పితామహుడని కొనియాడారు. బుధవారం ఆయన శ్రీహరికోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్వపు శాస్త్రవేత్తల దార్శకనితను ప్రస్తుత శాస్త్రవేత్తలు ముందుకు తీసుకువెళ్ళాలని ఇస్రో శాస్త్రవేత్తలకు సూచించారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషి దేశంలోని ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు వంటి అంశాలపై కార్యక్రమాలు నిర్వహించి వారిలో అంతరిక్ష పరిజ్ఞానం గురించిన అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇస్రో అధిపతి ఏ.ఎస్‌ కిరణ్‌కుమార్‌ను ఆయన అభినందించారు. అనంతరం షార్‌లో ఉన్న ఘన ఇంధన కర్మాగారం, వాహన అనుసంధాన భవనం, కొత్తగా నిర్మిస్తున్న రెండవ వాహన అనుసంధాన భవనం, రెండో ప్రయోగ వేదికలను సందర్శించారు. తొలుత, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో కలసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హెలికాప్టర్‌లో షార్‌కు విచ్చేయగానే ఇస్రో ఛైర్మెన్‌ కిరణ్‌కుమార్‌, డైరెక్టర్‌ కున్హికృష్ణన్‌, కంట్రోలర్‌ రాజారెడ్డి, ప్రపంచ అంతరిక్షవారోత్సవాల ఛైర్మెన్‌ వెంకటరామన్‌లతో పాటు రాష్ట్ర ప్రతినిధిగా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు, జిల్లా ఎస్పీ రామకృష్ణ, సిఐఎస్‌ఎఫ్‌ ఐజీ ఆనందమోహన్‌, డిఐజి కెఎల్‌ శివన్‌, కమాండెంట్‌ దుబె, తిరుపతి ఎంపి వరప్రసాద్‌, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి, శ్రీసిటీ అధినేత రవీంద్ర సన్నారెడ్డి, చెంగాళమ్మ ఆలయ ఛైర్మెన్‌ ముప్పాళ్ళ వెంకటేశ్వర్లురెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

venkaiahఉపరాష్ట్రపతి అంటే రబ్బర్‌స్టాంప్‌... ఆయనకు ఏమీ పని వుండదు... గుళ్ళకు గోపురాలకు తిరగడం తప్ప! ఉపరాష్ట్రపతిని చేసి ఆయన నోరు కట్టేసారు... ఆ పదవిలో కూర్చోబెట్టి ఆయన కాళ్లను కుర్చీకి కట్టేసారు... ఇంతకాలం దేశంలో ఉపరాష్ట్రపతి పదవిలో వున్న వారిపై ప్రజల్లో వున్న అభిప్రాయమిది. మన నెల్లూరీయుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక కూడా అందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కాని అందరూ వేరు... వెంకయ్యనాయుడు వేరు. పదవి అన్నది గుళ్ళు, గోపురాలకు తిరగడానికి, చేతులు కట్టేసుకుని ఇంట్లో కూర్చోవడానికి కాదు. ఉపరాష్ట్ర పతి... దేశంలోనే రాజ్యాంగపరమైన రెండో అత్యున్నత పదవి. ఈ పదవి ద్వారా దేశానికి ఎంతో సేవ చేయొచ్చు. దేశ ప్రజలకు ఎన్నో చేయొచ్చు. ఉపరాష్ట్రపతి అంటే రబ్బర్‌స్టాంప్‌ కాదని, ఉపరాష్ట్రపతి అంటే పనికే పని నేర్పించగల ఒక అత్యున్నతమైన బాధ్యత అని ఒక్క నెల కాలంలోనే మన వెంకయ్యనాయుడు నిరూపిం చారు. ఒక్క నెలరోజుల్లోనే ఆయన పాల్గొన్న కార్యక్ర మాలు, చేసిన పర్యటనలు చూస్తుంటే ఉప రాష్ట్రపతి పదవికి ఇంత శక్తి వుందా అనిపిస్తుంది.

ఆగస్టు 11వ తేదీన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశారు. అదే నెల 21వ తేదీన హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌరసన్మానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 26వ తేదీన గన్నవరం ఎయిర్‌ పోర్టులో దిగారు. ఎయిర్‌పోర్టు నుండి అమరావతిలోనే ఆయనకు లక్షలమంది విద్యార్థులతో స్వాగతం పలి కారు. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన గౌరవ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి అవాస్‌యోజన క్రింద రాష్ట్రంలో చేపట్టనున్న 2.25లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆయన శిలాఫలకం ప్రారంభించారు. అలాగే విజయవాడలో జరిగిన ఆలపాటి వెంకటరామయ్య శతజయంతి

ఉత్సవాలలో పాల్గొన్నారు. 27వ తేదీ చెన్నైలో స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అలాగే విద్యార్థులతో సమావేశమై వృత్తి నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసంపై తన సందేశమిచ్చారు. అదేరోజు అన్నా యూనివర్శిటీలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ క్విట్‌ ఇండియా ఉద్యమానికి 75ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు.

సెప్టెంబర్‌ 3వ తేదీ హైదరాబాద్‌లోని నల్సర్‌ యూనివర్శిటీలో జరిగిన 78వ అంతర్జాతీయ న్యాయ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అలాగే 5వ తేదీ హైదరాబాద్‌లోని డా|| ఎంసిఆర్‌ హెచ్‌ఆర్‌డి ఇన్‌స్టిట్యూట్‌లో ఏఐఎస్‌ మరియు సిసిఎస్‌ ఆఫీసర్స్‌ కొరకు నిర్వహించిన 92వ ఫౌండేషన్‌ కోర్సును ఆయన ప్రారంభించారు. సెప్టెంబర్‌ 8, 9తేదీ లలో జార్ఖండ్‌లో పర్యటించారు. జార్ఖండ్‌ ప్రభుత్వం రాంచిలోని ప్రభాత్‌ తార స్టేడియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే రాంచి స్మార్ట్‌ సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏ పదవిలో వున్నా వెంకయ్య వెంకయ్యే! ఆయన నోరు కట్టేయాలన్నా, పని చేయకుండా చేతులను కట్టేయాలన్నా కష్టమే! ఒక నెలలో ఒక ఉపరాష్ట్రపతి ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం చరిత్రలో లేదు, భవి ష్యత్‌లో వెంకయ్యనాయుడిదే ఒక చరిత్ర కావచ్చు.

Page 1 of 4

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter