గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సంఘ టన హాస్యనటుడు విజయసాయి ఆత్మహత్య. గతంలో ఎంతో మంది సినీ ప్రముఖులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారందరివి వివిధ కోణాలు, పలు కారణాలు. కానీ ఈ ఉదంతం మాత్రం వార్తల్లో నానుతూనే వుంది. ఇందుకు కారణం విజయ్ మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో. బహుశా ఇలా సెల్ఫీలలో సైతం మరణవాంగ్మూలం ఇస్తారనే విషయం పోలీసుశాఖకు కూడా తొలిసారిగా అర్థమైనట్లుంది. మామూలుగా లేఖల రూపంలో దొరికే వాంగ్మూలాలని వాళ్ళు ఏమైనా చేసేయగలరు కానీ ఇలా సెల్ఫీవీడియోలను ఏమార్చడం ఎవరి తరమూ కాదు. ఈ సెల్ఫీని విజయ్‌సాయి ఎంతమందికి పంపించి వుంటాడో వారికి తెలియదు కాబట్టి ఈ విషయంలో వాళ్ళు గోల్మాల్ చేసే అవకాశమే లేదు.
ఇక సెల్ఫీ వీడియోతో పాటు దొరికిన సాక్ష్యాల ఆధారంగా (కార్లు, ఫోన్ సంభాషణలు) ఈ వ్యవహారంలో శ్రీనివాస్ అనే న్యాయవాది, శశిధర్ అనే పారిశ్రామికవేత్త, విజయసాయి భార్య ఏ1 ముద్దాయి వనితరెడ్డిలతో పాటు ఏ2, ఏ3 ముద్దాయిలుగా వుండడంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. పోలీసులకు దొరికిన రెండుకార్లలో ఒక దానిపైన అడ్వకేటు స్టిక్కర్ ఉండడం, మరో కారు శశిధర్‌కు చెందిన నవయుగ కంపెనీకి చెందడం.
నవయుగ కన్స్ట్రక్షన్స్, నవయుగ ఇన్ఫోటెక్‌తో పాటు కృష్ణ పట్నం పోర్టు కంపెనీలు శశిధర్‌కి చెందినవి కావడంతో మీడియా హడావుడి కొంచెం ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే గంటకో కథ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చూపిస్తూ ఇది మా పరిశోధన అంటూ జబ్బలు కొట్టుకుం టున్నారు. పై విషయాలన్నీ మన కనవసరం. అసలు ఎక్కడో సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసుకునే విజయ సాయి భార్యకీ ఈ శ్రీనివాస్, శశిధర్లకీ వున్న సంబంధ భావ్యాలు ఏమిటి...? బంధమా... బంధు త్వమా... లేక వేరే ఏదైనా అనుబంధమా...? ఈ ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు చెప్పాల్సివుంది.
నెల్లూరుజిల్లాకి సంబంధించినంత వరకు కృష్ణపట్నం పోర్టన్నా, ఆ కంపెనీ యాజమాన్య మన్నా ఓ ప్రతిష్టాత్మక సంస్థగా ప్రతిష్టాత్మక వ్యక్తులుగా అందరూ చూస్తారు. ఇక జిల్లా యంత్రాంగ మైతే గల్లీ నుండి ఢిల్లీ వరకూ ప్రభుత్వ పెద్దలతో పోర్టు యాజ మాన్యానికున్న పలుకుబడిని దృష్టిలో వుంచుకుని వాళ్ళ ఆజ్ఞలకు, ఆదేశాలకు, ఆలోచనలకు తోక వూపుతూ పని చేస్తారు. ప్రతి ఫలంగా వాళ్ళ మర్యాదలనీ ఆస్వాదిస్తారు.
ఇలాంటి తరుణంలో పోర్టు యం.డి శశిధర్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తవమా? కాదా? అని రుజువు చేసుకోవలసిన బాధ్యత వారిపైనే వుంది. వారికి అపార పలుకుబడి వుండొచ్చు, వేలకోట్లు ఆస్తులుండొచ్చు... కానీ కాండక్ట్ & క్యారెక్టర్ చాలా ముఖ్యం. ఇప్పటికే వారి పోర్టులో భాగంగా సముద్ర మధ్యలో మయసభను తలపించే ''దక్షిణ్''లో జరుగుతున్న 'దక్షిణ' వ్యవ హారం కథలు కథలుగా బయటకు వినిపిస్తూనే వుంది. వాయు మార్గంలో వచ్చే విఐపిలకు జరిగే విందు వినోదాల ముచ్చట వాడవాడలా షికారు చేస్తూనే వుంది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగినట్లుగా ఈ ''దక్షిణ్''లో వారు జరిపే కార్యకలాపాలు ఎవరికీ తెలియవని అనుకున్నా అది వారి భ్రమే.
నెల్లూరీయులకు పోర్ట్ అంటే ఓ ల్యాండ్‌మార్క్. నెల్లూరు అభివృద్ధికి దిక్సూచిగా కృష్ణపట్నం పోర్టును చూస్తారు. అలాంటి సంస్థ యాజమాన్యం ఇలాంటి 'గలీజు' వ్యవహారంలో అభాసు పాలైతే అది వారికే కాదు, వారిపై నమ్మకం పెట్టుకున్న జిల్లా వాసులకీ అవమానమే. నెల్లూరు పారిశ్రామికవేత్తలకు విశ్వ వ్యాప్తంగా ఒక గుర్తింపు వుంది. మేధావులుగా పేరు ఉంది. చిల్లర చేష్టలకు దూరంగా వ్యాపారాన్ని భక్తితో చేస్తారన్న నమ్మకం ఉంది. ఒక జివికె, ఒక శీనయ్య, ఒక గునుపాటి ప్రసాద్‌రెడ్డి, ఒక దొడ్ల కుటుంబం, ఒక అల్లారెడ్డి కుటుంబం, ఒక సీబ్రోస్ కుటుంబం లాంటి ఎందరో తమ కండక్ట్‌ని ఉన్నతంగా ఉంచు కున్నవారే. శశిధర్ నెల్లూరు వాడు కాకపోయినా ఇప్పుడు నెల్లూరి వ్యాపారవేత్త కిందే లెక్క. ఇప్పుడు ఆయన శీలం ఏ3 నిందితునిగా పోలీస్ రికార్డ్స్‌లో భద్రంగాఉంది. అదీ తన భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తూ మరణించిన విజయ్ మాటల కారణంగా శశిధర్ పరువు బజారున పడింది. ఇప్పుడు తన శీలం ఉన్నతమైందని నిరూపించుకోవాల్సిన బాధ్యత శశిధర్పైనే ఉంది. విలువలతో కూడిన వ్యాపారం చేసే నెల్లూరియన్స్ పక్కన ధైర్యంగా నిలబడా లంటే కడిగిన ముత్యంలా బయటకు రావాల్సిన అగత్యం ఇప్పుడు శశిధర్పైనే ఉంది. వేచిచూద్దాం చట్టం ఎవరికి చుట్టమౌతుందో!