కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనతో 2019లో డైరక్ట్‌గా ఫైనల్ మ్యాచ్ ఆడాలనుకుంటున్న చంద్రబాబుకు 'నంద్యాల' రూపంలో సెమీ ఫైనల్స్ ఆడాల్సివస్తోంది.
రాష్ట్రంలో ఏ ఒక్క అసెంబ్లీకి కూడా ఉపఎన్నికలు జరిపించడం చంద్రబాబుకు ఇష్టం లేదు. అలా జరిగి తెలుగుదేశం బోర్లా పడితే తమ పతనం అక్కడనుండే మొదలవుతుందని, ఒక అసెంబ్లీ ఎన్నిక ప్రభావం మొత్తం రాష్ట్రంపై పడుతుందని చంద్రబాబు భయం. ఆ భయంతోనే ఆయన ఏదో ఒక ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి తన కొడుకు లోకేష్‌ను ఉపఎన్నిక ద్వారా శాసనసభకు పంపించే అవకాశ మున్నా, ఆ సాహసం చేయలేక శాసనమండలికి పంపించాడు.
ఇప్పుడు నంద్యాల ఉపఎన్నికను తప్పించుకోలేని పరిస్థితి. మన రాష్ట్రంలో ఒక సాంప్రదాయం వుంది. ఏ పార్టీకి చెందిన సభ్యుడైనా చనిపోతే, ఆ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికల్లో సదరు సభ్యుడి కుటుంబసభ్యులు పోటీచేస్తే ప్రతిపక్షం పోటీ పెట్టదు. అయితే ఇంతవరకు ఆ విధంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన వారంతా కూడా పార్టీ గుర్తు మీద గెలిచాక ఆ పార్టీలో ఉంటూ చనిపోయిన వాళ్ళే! కాని, ఇక్కడ భూమా నాగిరెడ్డి 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నుండి వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా గెలిచాడు. ఏడాది తర్వాత తెలుగుదేశంలో చేరాడు. ఇప్పుడు తెలుగుదేశం నాయకుడిగా మృతిచెందాడు. కాబట్టి నంద్యాల అసెంబ్లీ సీటు మాది అన్నది జగన్ వాదన. ఆ సీటు మాది కాబట్టే మేం పోటీకి దిగుతామంటున్నాడు.
జగన్ వాదనతో ఏకీభవించి చంద్రబాబు అభ్యర్థిని పెట్టకుండా ఉండలేడు, ఖచ్చితంగా పోటీ పెట్టాల్సిందే! మరణించిన నాయకుడి కుటుంబసభ్యులను పోటీకి దించితేనే కొంతన్నా సానుభూతి ఉంటుంది. కాని ఇక్కడ చూస్తే నాగిరెడ్డి పెద్దకూతురు అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండో కూతురు, కొడుకు చిన్నపిల్లలు. వారిని పోటీకి దించడం కష్టమే! ఆ కుటుంబసభ్యులు కాకపోతే కనీసం సానుభూతి కూడా పనిచేయదు. ఇక 2014 ఎన్నికల్లో నాగిరెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిన శిల్పామోహన్‌రెడ్డిని దించాలి. ఆయనను దించితే భూమా వర్గీయులు పనిచేయరు. ఇక ప్రభుత్వ వ్యతిరేకత బలంగా పనిచేస్తోంది. ఒకవేళ శిల్పా మోహన్‌రెడ్డికి తెలుగుదేశం సీటివ్వకపోతే, ఆయనను తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడానికి వైకాపా రెడీగావుంది. మారిన పరిస్థితుల్లో భూమా మృతి పట్ల కూడా పెద్దగా సానుభూతి వచ్చే అవకాశం లేకపోవడం తెలుగుదేశంకు ఇబ్బందికర వాతావరణమే! కర్నూలుజిల్లాలో వైకాపా బలంగా ఉండడం, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా పెరుగుతుండడం, కోట్ల కుటుంబం వైకాపాలో చేరుతుండడం, తెలుగుదేశంపై కె.ఇ సోదరులు అసంతృప్తిగా ఉండడం వంటి పరిణామాలన్నీ వైకాపాకు కలిసొచ్చేవే!