mpsఒక ఎమ్మార్వో పాస్‌బుక్‌లు ఇవ్వడం కోసం రైతుల నుండి లంచం తీసుకుంటూ ఏసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు... అతనికి ఉద్యోగం పోయింది. పదేళ్ళ సర్వీసు పోయింది. రావాల్సిన బెనిఫిట్స్‌ పోయాయి. అప్పటిదాకా సంపాదించిన అక్రమ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకుంది. జీతం లేక, డబ్బులొచ్చే మార్గం లేక కొడుకు చదువు ఆగింది. కూతురి పెళ్ళి సంబంధం రద్దయ్యింది. కొడుకు చేసిన పనికి బజారులో పరువు పోవడంతో తల్లిదండ్రులు మంచం పట్టారు. భార్య మానసిక రోగంతో ఆసుపత్రిపాలైంది.

ఒక ఉద్యోగి కేసులో ఇరుక్కుంటేనే ఇంత ప్రభావం ఉంటుంది. అదే ఒక ముఖ్యమంత్రి కేసులో ఇరుక్కుంటే... రాష్ట్రమనే కుటుంబమంతటిపై దాని ప్రభావం వుంటుంది. అలాంటి ప్రభావమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై పడింది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన రాజకీయ స్వార్ధం కోసం చేసిన ఒకే ఒక్క అడ్డదారి పనికి ఈరోజు రాష్ట్రం భారీగా నష్టపోతోంది. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ ఏసిబికి అడ్డంగా దొరికిపోయిన పాపానికి ఈరోజుకీ రాష్ట్రం అన్యాయం పాలవుతోంది. కేవలం చంద్రబాబు ఓటు-నోటు కేసు వల్లే హైదరాబాద్‌లో పదేళ్ళ హక్కున్నప్పటికీ వదులుకుని వచ్చేసాం. చట్టబద్ధంగా హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ సంస్థలలో ఏపికి వాటా రావాలి. ఆస్తుల పంపకాలు జరగాలి. అదేమీ లేకుండానే హైదరాబాద్‌ నుండి రూపాయి ఆస్థి తెచ్చుకోకుండానే వదిలేసి వచ్చాం. కేవలం ఓటు-నోటు కేసులో కేసీఆర్‌కు భయపడే చంద్రబాబు ఏపికి రావాల్సిన ఆస్తుల కోసం పోరాడకుండా మూటాముల్లె సర్ధుకుని వచ్చేసాడు. సరే... అంతటితో నష్టం ఆగిందా అంటే అదీలేదు. ఈ ఓటు-నోటు కేసు మూలంగానే కేంద్రప్రభుత్వాన్ని నిలదీయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వ ముంది. చాలా దారుణమైన రాష్ట్ర విభజన ద్వారా ఏపికి గత యూపిఏ ప్రభుత్వం అన్యాయం చేస్తే, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ఏపికి మరింత ద్రోహం చేస్తోంది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ పట్ల బీజేపీ నాయకులు, అందులోనూ ప్రత్యేకంగా నరేంద్రమోడీ ఎక్కడా లేని సానుభూతి చూపించాడు. తీరా అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు. ఏ ఒక్క హామీ పట్ల చిత్తశుద్ధి చూపలేదు. ప్రత్యేకహోదాను అటకెక్కించారు. దీనికి పలు సాకులు చూపారు. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలోనూ వివాదాలే! ఈ ప్రాజెక్ట్‌ను కేంద్రమే చేపట్టి పూర్తి చేసుంటే సరిపోయుండేది. మధ్యలో చంద్రబాబు వేలు పెట్టాడు. ఈ ప్రాజెక్ట్‌ను తమకు అప్పగించా లని కోరాడు. పోలవరం నుండి ఏదో ఆశించి ఆయన కేంద్రం నుండి లాక్కున్నాడు. వాళ్ళు కూడా మాకెందుకొచ్చిన పీడా అని చెప్పి ఈయనకు వదిలేసారు. చిక్కిందే ఛాన్స్‌ అని చంద్రబాబు దీనిని మరో అమరావతి రాజధానిని చేశారు. 16వేల కోట్ల అంచనా ప్రాజెక్ట్‌ను 58వేల కోట్ల అంచనాకు తీసుకెళ్లారు. ఇక్కడే కేంద్రానికి మండింది. లెక్కలు చూపిస్తేనే బిల్లులు అంటూ పేచీ పెట్టడంతో పోలవరం ప్రాజెక్ట్‌లో స్థబ్ధత ఏర్పడింది.

ఇక మొన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో అయితే ఏపికి పూర్తిగా మొండిచేయే చూపారు. పోలవరంకు నిధుల ఊసేలేదు. విశాఖ రైల్వేజోన్‌ ప్రస్తావన లేదు. దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ హామీలు లేవు. ఏపికి ప్రత్యోకహోదా సరే ప్రత్యేకప్యాకేజీ క్రింద ఇచ్చిన నిధుల ప్రస్తావన లేదు. మొత్తంగా ఏపిని చిన్నచూపు చూసారు. గత నాలుగు బడ్జెట్‌లలో జరిగిన అన్యాయాన్నే ఈ బడ్జెట్‌లోనూ కొనసాగించారు.

రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కేంద్రంపై గట్టిగా పోరాడలేని పరిస్థితి చంద్రబాబుది. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగాక ఆయనకు ఏ మాత్రం పౌరుషం వున్నా కేంద్రంలో తన ఇద్దరు మంత్రుల చేత రాజీనామా చేయించి వుండాలి. ఎన్డీఏ నుండి వైదొలిగి వుండాలి. కాని అలా చేయలేదు. మోడీతో ఇప్పుడు పెట్టుకుంటే 'ఓటు-నోటు' కేసును మళ్ళీ ఎక్కడ గెలుకుతాడోనని భయం. అలాగని కనీస అసంతృప్తి వ్యక్తం చేయకుంటే రాష్ట్ర ప్రజల్లో చులకనైపోతామని భయం. అందుకే కేంద్రంపై చంద్రబాబు ఆగ్రహంతో వున్నట్లు అనుకూల మీడియాలో కవరేజీ... పార్లమెంటులో టీడీపీ ఎంపీల నామ్‌కే వాస్తు నిరసనలు... వీటివల్ల తెగేది లేదు... తెల్లారేదీ లేదు. చంద్రబాబు ఆగ్రహించాడని ఎల్లో మీడియాలో రాగానే మోడీ ఫ్యాంటు తడుపుకునేదేమీ లేదు. చంద్రబాబు వాళ్ళ చేతుల్లో బుక్కయ్యున్నాడు. కాబట్టే రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతున్నా ఎదిరించే పరిస్థితి లేకుండాపోయింది. అయితే ఇక్కడ కేంద్రం గుర్తిం చాల్సింది... వాళ్ళు 'ఓటు-నోటు' కేసును అడ్డం పెట్టుకుని ఆడుకుంటున్నది చంద్రబాబు తోనే కాదు... ఆరుకోట్ల ఆంధ్రుల భవిష్యత్‌తో కూడా అని.

jaganవైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డికి రాజకీయ సలహాదారులెవరోగాని, ఆయనకు చచ్చు సలహాలిస్తున్నట్లున్నారు. చూడబోతే చంద్రబాబు మనుషులే జగన్‌కు రాజకీయ సలహాదారులుగా ఉన్నట్లుంది. లేకపోతే అనాలోచిత నిర్ణయాలతో అనుకూలంగా మారుతున్న అవకాశాలను సైతం కాలదన్నుకుంటున్నాడు.

2014 ఎన్నికల్లో వేసిన తప్పటడుగులే ఆయనను అధికారా నికి దూరంగా పెట్టాయి. ఆ తప్పటడుగులకు ప్రధానకారణం అంతకుముందు ఏడాది క్రితం జరిగిన ఉపఎన్నికలే! కాంగ్రెస్‌ నుండి వైకాపాలో చేరిన ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఆయన ఉపఎన్నికలకు పోయాడు. ఆనాడు రాష్ట్రంలో వున్న రాజకీయ పరిస్థితులు వేరు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా చచ్చుబడిపోయి వుండింది. ఆ సమయంలో ప్రజల్లో వై.యస్‌. సానుభూతి ప్రబలంగా వుంది. జగన్‌ పట్ల క్రేజ్‌ విపరీతంగా వుండింది. కాబట్టే 17 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే 15స్థానాల్లో వైకాపా అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు. రెండుచోట్ల మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఆరోజు భారీ మెజార్టీలతో గెలిచిన స్థానాలను చూసుకునే జగన్‌ ఇక అధికారం ఖాయమనుకునే కోణంలోకి వెళ్లాడు. కాని విజ్ఞులు ఇక్కడే ఆలోచిస్తారు. గెలిచిన 15స్థానాలను లెక్కలోకి తీసుకోకుండా ఓడిన రెండు స్థానాలను గురించి జగన్‌ ఆలోచించి వుంటే పరిస్థితి వేరుగా వుండేది. ఆరోజు గెలిచిన స్థానాలన్నీ కూడా రెడ్ల ప్రాబల్యం వున్న నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోనివే! ఓడిన రెండు స్థానాలు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోనివి. ఈ రెండు జిల్లాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువ. ఈ రెండు సీట్లు ఓడిపోయినప్పుడే జగన్‌ జాగ్రత్తగా అక్కడి కాపులను పట్టుకొచ్చి వుండాలి. కాని ఆ ఉపఎన్నికల్లో వచ్చిన భారీ మెజార్టీలు 2014 ఎన్నికల్లో జగన్‌ను పరోక్షంగా దెబ్బతీసాయి. అతనిలో నిర్లక్ష్యం పెరగడానికి ఆ ఎన్నికలే కారణమ య్యాయి. జగన్‌ మళ్లీ ఇప్పుడు అదే పంథా లోకి పోతున్నాడు. ప్రత్యేకహోదా ఉద్య మంలో భాగంగా తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించి ఉపఎన్నికలకు పోతానంటున్నాడు. ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు దీనివల్ల ఎవరికి ఉప యోగం! అసలు వైకాపా ఎంపీలు రాజీ నామాలకు సిద్ధంగా ఉన్నారా? ఒక లోక్‌ సభ ఎంపీకి అవుతున్న ఖర్చు 50 నుండి వంద కోట్ల దాకా వుంటుంది. ఐదేళ్లకో సారి ఎంపీ ఎలక్షన్‌ చేయడానికే వాళ్లకు వాచిపోతుంది. అలాంటిది ఐదేళ్లకు రెండు సార్లు పోటీ చేయాలంటే మాటలా? అదీ గాక అభ్యర్థుల ఖర్చు పార్టీ భరించే పరిస్థితి వుందా? అభ్యర్థులనే ఖర్చంతా పెట్టుకో మంటే పెట్టుకుంటారా? ఇది సాధ్యమయ్యే పనే కాదు. రాజీనామా చేసేది లేదని ఒక ఎంపీ అడ్డం తిరిగినా పార్టీ పరువు పోతుంది. ఒకవేళ జగన్‌ మాటకు కట్టుబడి ఎంపీలు రాజీనామా చేసారే అనుకుందాం. ఉపఎన్నికలు జరిగినంత మాత్రాన ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఒక వేళ 8ఎంపీ సీట్లలో తిరిగి వైకాపా అభ్యర్థులే గెలిచినా తెలుగుదేశంకు పోయేదేమీ లేదు. ఒకవేళ వైకాపా ఒక ఎంపీ సీటులో ఓడిపోయినా అది ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న తెలుగుదేశంకు ప్రాణప్రతిష్టే అవుతుంది. ఒకవేళ భారీ మెజార్టీలతో వైకాపా అభ్య ర్థులే గెలిచారనుకుందాం... దానివల్ల చంద్రబాబు తనపై వ్యతిరేకతను తగ్గించు కునే ప్రయత్నాలు మొదలుపెట్టొచ్చు. ఈ ఉపఎన్నికల వల్ల ఏ విధంగా చూసినా జగన్‌కు నష్టం, చంద్రబాబుకు లాభం. ప్రత్యేకహోదా పేరుతో ఉపఎన్నికల్లో పోటీ చేసి వైకాపా అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచినా కేంద్రం ఇప్పటికిప్పుడు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేదేమీ లేదు. ఇప్పుడు అర్థాంతరంగా ఉపఎన్నికలంటే ప్రజల్లోనూ అంత ఆసక్తి లేదు. అదీగాక ఏపి ప్రజల్లో ఎటువంటి భావోద్వేగాలు లేవు. కాబట్టి ప్రత్యేక హోదా సాధన కోసం జగన్‌ రాజీనా మాలను కాకుండా ప్రత్యామ్నాయ మార్గా లను ఆలోచించాలి.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
  ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
 • వేగమందుకున్న ప్రయాణం
  సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
 • ఎవరెవరెక్కడ?
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…
 • టీడీపీ నుండి... లోక్‌సభకెవరో?
  1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక అప్పటి నుండి ఇప్పటివరకు నెల్లూరు లోక్‌సభకు 10సార్లు ఎన్నికలు జరిగాయి, 2012లో జరిగిన ఉపఎన్నికను కూడా కలుపుకుంటే! ఈ పదిసార్లలో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండంటే రెండుసార్లే! ఏ లోక్‌సభ స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీకి…
 • అజీజా... నిన్నొదలా...!
  నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…

Newsletter