నవ్యాంధ్రలో శరవేగంగా చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పు ప్రభావం నెల్లూరుజిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్ధుగా వున్న జిల్లా రాజకీయం ఇప్పుడిప్పుడే ఊపందుకుని వేసవి తాపంతో పాటు వేడెక్కుతోంది.
జిల్లాలోని పది నియోజకవర్గాలలో వైసిపికి ఇప్పటికే సమన్వయకర్తలున్నారు. వారే రేపు రాబోయే ఎన్ని కల్లో అభ్యర్థులన్న ధీమాలో కూడా వున్నారు. అయితే ఇక్కడ తాము గెలవడం ముఖ్యమా, తమ లీడర్ ముఖ్యమంత్రి కావడం ముఖ్యమా అన్న ఆలోచన చేయగలిగితే వీరిలో చాలా మంది వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. తమ గెలుపే ప్రధానం అని స్వార్ధంతో భావిస్తే వీళ్ళు పార్టీని చిక్కుల్లోకి నెట్టే పరిస్థితి ఏర్పడు తుంది. ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బాగా బలంగా వున్నప్పటికీ కొన్ని చోట్ల అభ్యర్థుల పట్ల అసంతృప్తి ఉందన్న వార్త బలంగా వినిపిస్తోంది. జిల్లాలో ఏ నియోజకవర్గమైనా టిక్కెట్టు పొందగలిగితే గెలుపు ఖాయం అన్న ధీమా కొత్త నేతల్లోనే కాదు, జిల్లా ప్రజల్లో కూడా వుంది. సిట్టింగ్‌ల పైన సహజంగానే కొంత అసంతృప్తి వుంటుంది కాబట్టి కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చక తప్పదని పి.కె. సర్వే చెబుతోందన్న వార్త కూడా షికారు చేస్తోంది. అయితే జిల్లా అంతటా ప్రస్తుతం వినిపిస్తున్న చర్చ పార్టీకి రానున్న కొత్త నేతలు ఎవరు...? వారి స్థానాలు ఏవి...?
ముందుగా నెల్లూరు పార్లమెంటు విషయానికొస్తే ఇక్కడ ఖచ్చితంగా కొత్త అభ్యర్థి అవసరం వుంది. మేకపాటి రాజమోహన్‌రెడ్డి పార్టీకి పెద్దదిక్కుగా, జగన్‌కి విధేయుడిగా మంచి మార్కులు సంపాదించు కున్నప్పటికీ ఎంపిగా జిల్లా ప్రజలు ఫెయిల్ మార్కులే వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేదా ఆదాల ప్రభాకర్‌రెడ్డిల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో మేకపాటిపై పోటీ చేసి ఓడిపోయిన ఆదాలయితే గెలుపు ఖాయం అన్న అభిప్రాయం చాలామందిలో వున్నప్పటికీ ఆయన అసెంబ్లీకి వెళ్లాలన్న గట్టి పట్టుదలతో వున్నట్లు సమాచారం.
ఇక వెంకటగిరి విషయానికొస్తే ఇక్కడ కొమ్మి లక్ష్మయ్యనాయుడు పూర్తిగా రిటైర్ అయిపోవడంతో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఈ సీటును కనిపెట్టుకుని పనిచేసుకుంటున్నాడు. జగన్ కూడా ఇప్పటికే హామీ ఇచ్చినట్లు చెప్తున్నా, ఇక్కడి నుండి మాజీముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుమారుడు రాంకుమార్‌రెడ్డి పేరు బలంగా వినపడుతోంది. రాంకుమార్ అయితే వెంకటగిరితో పాటు గూడూరు, సూళ్లూరుపేట నియో జకవర్గాల్లో కూడా పార్టీకి మేలు జరిగే అవకాశాలు బలంగా వున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మాజీముఖ్యమంత్రి కొడుకుగా నేదురుమల్లి వారసుడిగా జనం ఆయనకు జేజేలు పలుకుతారన్నది వీరి అభిప్రాయం. వెంకటగిరి నియోజకవర్గంలో బలమైన బంధువర్గం గల డిసిసిబి ఛైర్మెన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి కూడా రంగంలో ఉన్నట్లు తెలు స్తోంది. సీటిచ్చేటట్లైతే వైసిపిలో చేరడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని సమాచారం.
గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మేరిగ మురళిని నిర్ణయించి గెలిపించే బాధ్యత గౌతంరెడ్డికి అప్పజెప్పినా మురళీరవం నియోజకవర్గంలో అంతగా వినిపించకపోవడంతో ఇక్కడ పనబాక కృష్ణయ్యని తెరపైకి తెచ్చే ఆలోచనలో మేధావులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అంగబలం అర్ధబలం అన్నీ ఉన్న కృష్ణయ్య ఇక్కడ గట్టి అభ్యర్థి కావచ్చన్నది అంచనా. ఇక్కడ ఇన్ఛార్జ్ లుగా పార్టీ గెలుపుకోసం గట్టిగా పనిచేయాలనుకుంటున్న పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డికి, యల్లసిరి గోపాల్ రెడ్డికి, కోడూరు మీరయ్యకి ఈసారి ఎన్నిక పెద్ద సవాల్ కాబట్టి అభ్యర్థి విషయంలో వీళ్లు కూడా రాజీపడక పోవచ్చు.
ఇక ఆత్మకూరులో రామనారాయణరెడ్డి ఏ పార్టీ నుండి పోటీ చేసినా గెలుస్తాడని అక్కడ ఓటర్లు బాహా టంగానే చెప్తున్నారు. మంత్రిగా ఆయన చేసిన అభివృద్ధిని మరువలేకున్నామని, గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా నిలబడడం కారణంగా మన స్సాక్షిని చంపుకుని గౌతంరెడ్డికి ఓటేశామని అంటు న్నారు. రామనారాయణరెడ్డి ఈసారి ఏ పార్టీ నుండి పోటీ చేసినా ఆయనకే ఓటేస్తామని ఒట్టేసి మరీ చెప్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ వైసిపి నుండి రామ నారాయణరెడ్డి వస్తే ప్రభంజనంలా గెలిచే అవకా శాలు వున్నాయని అంటున్నారు. గౌతం లాంటి విధేయులు జగన్ మాట జవదాటే అవకాశం లేదు కాబట్టి, పార్టీ అధికారంలోకి వస్తే గౌతంని యంయల్సి చేసి ఆయనను మంత్రిని కూడా చేసే సాన్నిహిత్యం, సహచర్యం జగన్‌కి గౌతంకి మధ్య వుంది. కాబట్టి ఇక్కడి అభ్యర్థిని మార్చడం సులభమే.
కోవూరు విషయానికొస్తే ఇక్కడకూడా పార్టీ బలంగా వుండడమే కాకుండా ప్రసన్నకుమార్రెడ్డిపైన సానుభూతి కూడా వుంది. దీంతో సమానంగా పోలంరెడ్డిపైన అసంతృప్తి కూడా ఎక్కువగానే వుంది. అయితే... ఆఖరు నిముషంలో ఏదో విధంగా గెలుపు గుర్రంగా అవతారమెత్తే పోలంరెడ్డి ఆర్ధికబలంతో ఈ సీటుకు ఎసరుపెట్టే ప్రయ త్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రసన్న వైపే మొగ్గు చూపుతున్నట్లు వినికిడి.
సమీకరణలు మారి కొత్త నీరు పార్టీకి వస్తే ఉదయగిరి నుండి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పోటీ చేస్తాడని కూడా వినిపిస్తోంది. ఇక్కడ శేఖర్‌రెడ్డి ఇమేజ్ బలంగా ఉన్నప్పటికీ అన్న కోసం త్యాగం చేసే పరిస్థితే వస్తే ఆయన బలికాక తప్పేటట్లు లేదు.
కావలిలో ప్రతాప్ జోరుగా ప్రచారం చేసుకుం టున్నప్పటికీ ఇక్కడ వంటేరు వేణుగోపాలరెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిలు లైన్లో వున్నారు. అయితే వీరందరినీ ప్రక్కనబెట్టి కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తే వివాదం సద్దుమణుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్న క్రమంలో ఇక్కడ కూడా ఆదాల పేరు వినిపిస్తోంది. అయితే జగన్మోహన్రెడ్డి పాద యాత్రలో వుండడంతోనూ మరోవైపు హోదా పోరు పతాకస్థాయికి చేరుకోవడంతోనూ జిల్లాలోని నియోజకవర్గాల అభ్యర్థుల నిర్ణయం మరికొద్ది నెలలు వాయిదా పడే అవకాశం ఉంది. మిగిలిన నియో జకవర్గాలలో సర్వేపల్లి మినహా మిగిలిన నెల్లూరు నగరం, రూరల్, సూళ్లూరుపేటలలో అభ్యర్థులు దాదాపు ఖరారైపోయినట్లే.
ఏది ఏమైనా రాబోయే ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి. ఇక్కడ అందరి ధ్యేయం ఒక్కటే కావాలి. అది కేవలం వై.యస్.జగన్ ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్రంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన అందించాలి. ఇదొక్కటే నినాదం కావాలి. ఇదొక్కటే లక్ష్యం కావాలి. ఇదొక్కటే అంతిమ నిర్ణయం కావాలి. అప్పుడే పార్టీ విజయం నల్లేరుపై నడకలా సాగుతుంది. వేచిచూద్దాం ఏం జరుగుతుందో...!
రాజకీయ ప్రయాణంలో ఆయన తొలి అడుగు పడింది. ఆ అడుగు ఇంకెన్ని వేల అడుగులు వేస్తుందో... ఇంకెన్ని వేల కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుందో... ఆ అడుగు ఎన్ని రాజకీయ మార్పు లకు శ్రీకారం చుడుతుందో...
నెల్లూరీయుడు, వదాన్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఈ నెల 5వ తేదీ
ఉదయం ప్రమాణస్వీకారం చేసారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మెన్ మరియు నెల్లూరీ యులైన యం.వెంకయ్యనాయుడు సాటి నెల్లూరీయుడైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఆ క్షణం నుండి ప్రజాప్రతినిధిగా ఆయన ప్రయాణం మొదలైంది. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన సాటి తెలుగోడు, నెల్లూరీయుడు విపిఆర్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య అచ్చతెలుగులో శుభాకాంక్షలు తెలపడం విశేషం. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారంతో రాజ్యసభలో వైకాపా సభ్యుల సంఖ్య రెండుకు చేరింది. వైకాపా తరపున ఢిల్లీ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న విజయసాయిరెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తోడయ్యాడు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.... నెల్లూరీయులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఆంధ్రా ప్రజలకు బాగా పరిచయం ఉన్న పేరు. రేపటి నుండి దేశ వ్యాప్తంగా కూడా పరిచయం కానున్న పేరు.
ఇప్పటివరకు రాజకీయ నాయకుడిగా కంటే సేవాతత్పరుడిగా ఆయన ప్రజలకు సుపరిచితుడు. రాజకీయాల లోకి రాకముందు నుండే సేవారంగంలో వున్నాడు. సామాజిక, ఆథ్యాత్మిక రంగాలలో ఎన్నో సేవలందించారు. ఎన్నో మానవతా కార్యక్రమాలు నిర్వహిస్తూ గొప్ప మానవతావాదిగా ముద్రపడ్డారు. రెండు దశాబ్దాల క్రితం నెల్లూరుజిల్లాలో మాగుంట కుటుంబానికి గొప్ప పేరుండేది. వాళ్ళ సాయం పొందని కుటుంబం వుండేది కాదు. ఈ దశాబ్దంలో అంతటి గొప్పపేరు తెచ్చుకున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. పల్లెల గొంతు తడపడానికి మంచినీళ్ళిచ్చినా... పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించినా, భారీ ఎత్తున ఆథ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్నో అనాధ, వృద్ధాశ్రమాలకు చేయూతనిచ్చినా... అవన్నీ కూడా ఆయనలోని మానవత్వానికి నిదర్శనాలే! ఒక వ్యక్తిగా ఇంతకాలం ఆయన ప్రజలకు ఎంతో సేవచేసాడు. ఒక మంచి వ్యక్తికి ఈరోజు అధికారం అనే శక్తి తోడైంది. ప్రజలకు ఇంకా మంచే జరుగుతుంది. మంచితనం మూర్తీభవించిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభలో అడుగుపెట్టిన శుభసందర్భంగా 'లాయర్' అభినందనలు.
మనం భారతదేశంలో వున్నామా? పాకిస్తాన్లో వున్నామా? నరేంద్ర మోడీ మన దేశానికి ప్రధాన మంత్రా? పాకిస్థాన్ ప్రధాన మంత్రా? ఆయనేమన్నా భారతీయులకు ఆగర్భశత్రువా? మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన గజనీమహ్మద్ లాంటివాడా? మన దేశంలో బాంబులు పేల్చిన దావూద్ ఇబ్రహీం, కసబ్ లాంటి ఉగ్రవాదా? ఒక రాజ్యసభ సభ్యుడు ఆయనకు నమస్కారం చేస్తే తప్పవుతుందా?
నమస్కారం పెట్టినందుకే ఇంత రాద్ధాంతమా? ప్రధానికి దేశంలో ఇంకెవరూ నమస్కా రాలు పెట్టరా? ఆయనకు తెలుగుదేశం నాయకులు పెట్టేది మాత్రమే నమస్కారమా? వైకాపా నాయకులు పెడితే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడమా?
పార్లమెంటు సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పదమైంది. పార్లమెంటులో వున్న ప్రధానికి ఎంపీలందరూ అభివాదం చేస్తున్నారు. ఎవరు ఏ పార్టీ వారైనా ప్రధాని స్థాయి నాయకుడికి అభివాదం చేయడం, ఆయన ప్రతి నమస్కారం చేయడం భారతీయ సంస్కారంలో భాగం. ఏ తల మాసినోడు కూడా ఈ సంస్కారాన్ని తప్పుపట్టడు. కాని పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోడీని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నమస్కరించడాన్ని తెలుగుదేశం నాయకులు పెద్ద రచ్చ చేసారు. ప్రధాని కాళ్ళకు ఆయన పాదాభివందనం చేసాడని, తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాడని ప్రచారం గుప్పించారు. పచ్చమీడియా సంగతి ఇక చెప్పనవసరం లేదు. ప్రధానికి విజయసాయిరెడ్డి పాదాభివందనం చేసాడా లేదా అనే విషయం పక్కన పెడదాం! ఒక వేళ పాదాభివందనం చేసినా అది తప్పవుతుందా? వయసులో తనకన్నా పెద్దవారికి పాదాభివందనం చేయడం మన సంస్కృతిలో తప్పెలా అవుతుంది. మరి ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో తెలుగుదేశం నాయకులు ఎవరికీ పాదాభివందనాలు చేయలేదా? గతంలో వాజ్‌పేయి ప్రధానిగా వున్నప్పుడు అనేక సభలలో 'క్యూ'కట్టి ఆయనకు పాదాభివందనం చేసిన సంగతిని తెలుగుదేశం నాయకులు మరిచారా? ఒక వాజ్‌పేయి ఏంటి, ఎంతో మంది సీనియర్ నాయకుల కాళ్ళు వీళ్ళు పట్టుకోలేదా? పెద్దలకు పాదాభివందనం చేయడం తప్పు కాదు. కాళ్ళు పట్టుకున్నట్లు నటిస్తూ వాటిని లాగడమే తప్పు. తెలుగుదేశం నాయకుల మాదిరిగా విజయసాయిరెడ్డి ఆ పని చేయలేదు.
కేసుల నుండి విముక్తి కావడం కోసమే విజయసాయిరెడ్డి ప్రధాని కాళ్ళు పట్టుకున్నాడని గోల చేస్తున్నారు. అంటే వీళ్ళ మాటలు భారత న్యాయవ్యవస్థనే కించపరిచే విధంగా వున్నాయి. మరి ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకోబట్టే 'ఓటు-నోటు' కేసులో చంద్రబాబు ఇంకా జైలుకు పోకుండా వున్నాడా? ఆయన కాళ్ళు పట్టుకునే తనపై వున్న అన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడా? ఆయన కాళ్ళకు మొక్కే సుజనాచౌదరి బ్యాంకులను ముంచిన కేసుల నుండి తప్పించుకు తిరుగుతున్నాడా? ప్రధాని కాళ్ళు పట్టుకోబట్టే తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొందరు రాష్ట్రంలో ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎంతగా అక్రమా లకు పాల్పడుతున్నా కేసులు నమోదు కావడం లేదా? నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానా? లేక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తా? కాళ్ళు పట్టుకుంటే కేసులు మాఫీ అయ్యేపనైతే ఎవ్వరూ కోర్టు మెట్లెక్కబల్లేదు... మోడీ కాళ్ళకు మొక్కితే చాలు. సిగ్గు, సంస్కారం వున్న వాళ్లెవరూ భారత ప్రధానికి ఒక వ్యక్తి నమస్కరించడాన్ని రాజకీయం చేయరు? రచ్చ చేయరు? ప్రధాని కాళ్ళకు వాళ్ళు మొక్కితే సంస్కారం, ఇంకొకరు నమస్కరిస్తే అపచారం అన్నట్లుంది ఈ పచ్చ నేతల వ్యవహారం.