jaganఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలపై పార్లమెంటులో ఎవరి నాటకాలు వాళ్లాడుతున్నారు. ప్రత్యేకహోదాపై ఎవరి పిల్లిమొగ్గలు వాళ్లేస్తున్నారు. ఒక పార్టీ వాళ్ళు పార్లమెంటు బయట పగటి వేషాలేస్తుంటే.. పార్టీ పెట్టి కూడా ఎన్నికల్లో పోటీ చేయని నటనాయకుడొకరు జేఏసీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇలాంటి పగటి వేషాలకు, ఇట్లాంటి జేఏసీ యాక్షన్‌లకు కేంద్రం తలవంచుతుందా? ప్రధాని నరేంద్ర మోడీ తల దించుతాడా...?

టీడీపీ, పవన్‌కళ్యాణ్‌ రాజకీయ డ్రామాలకు చెక్‌పెడుతూ ప్రత్యేకహోదాపై ప్రతిపక్ష నేత వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి సంధించిన రాజీనామాస్త్రం ఇప్పుడు అధికారపక్షంలో గుబులు రేపుతోంది. పిల్లిమొగ్గలు, పగటి వేషాలతో కాకుండా ఆయన ప్రత్యేకహోదా కోసం నేరుగా కేంద్రంతో కయ్యానికే సిద్ధమైయ్యారు. పార్లమెంటు వేదికగానే ప్రత్యేకపోరుకు శ్రీకారం చుట్టాడు. ఏపికి ప్రత్యేకహోదా కోసం అవసరమైతే తమ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని జగన్‌ గతంలోనే ప్రకటించి వున్నాడు. చివరి బడ్జెట్‌లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేకహోదా కాదు కదా సరైన న్యాయం కూడా చేయలేని పరిస్థితులలో 'ప్యాకేజీ వద్దు - ప్రత్యేకహోదానే ముద్దు' అంటూ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కలిగిరిలో జరిగిన సభలో ప్రత్యేకపోరుకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకహోదాపై పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను ఆయన అశేష ప్రజానీకం సమక్షంలోనే ప్రకటించారు. మార్చి

1వ తేదీ నుండి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా ఉద్యమాలు జరుగుతాయి. మార్చి 1న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్‌ కార్యాలయాల ఎదుట వైసిపి ఆధ్వర్యంలో ధర్నా, కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాలు జరుగుతాయి. మార్చి 5వ తేదీన వైసిపి ఎంపీలు, సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ప్రత్యేకహోదా కోసం ధర్నా నిర్వ హిస్తారు. 3వతేదీన జగనే తాను పాద యాత్ర చేస్తున్న చోటు నుండి జెండా ఊపి వీరిని ఢిల్లీకి సాగనంపుతారు. మార్చి 5వ తేదీ నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో వైసిపి ఎంపీలు పాల్గొని సభలో ఏపికి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తారు. ఏప్రిల్‌ 6వ తేదీ దాకా జరిగే సమావేశాలలో ప్రత్యేకహోదాపై కేంద్రం నుండి ఎటువంటి హామీ రాక పోతే, దానికి నిరసనగా వైసిపి ఎంపీలు సమావేశాల చివరిరోజున తమ రాజీ నామాలను స్పీకర్‌కు ఇచ్చేసి రాష్ట్రానికి వచ్చేస్తారు. ఆ తర్వాత నుండి కూడా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా ఉద్యమాన్ని కొనసాగించేలా జగన్‌ వ్యూహరచన చేసారు.

ప్రత్యేకహోదా కోసం ఎంపీల చేత రాజీనామా చేయించాలని జగన్‌ చేసిన ప్రయోగం తిరుగులేని అస్త్రం. ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని చెప్పి జగన్‌ బంతిని ప్రత్యర్థుల కోర్టులోకి కొట్టాడు. ఇప్పుడు ప్రత్యర్థులది కక్క, మింగలేని పరిస్థితి.

రాష్ట్ర భవిష్యత్‌ కోసం, రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేకహోదానే మేలైన మార్గమని భావిస్తూ జగన్‌ ఆఖరి పోరాటానికి సిద్ధపడ్డాడు. ప్రతిపక్ష నాయకుడే ఏపికి ప్రత్యేకహోదా కోసం ఇంతకు తెగించి పోరాడుతుంటే, ఇక ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించి అధికారం అనుభవిస్తున్న చంద్రబాబు ఇంకెంత పోరాటం చేయాలి. కాని, చంద్రబాబు ప్రత్యేకహోదా పోరాటాన్ని ఎప్పుడో వదిలేసాడు. ప్రత్యేకప్యాకేజీయే చాలనుకున్నాడు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా సంజీవని కాదని సలహా కూడా ఇచ్చాడు. ప్రత్యేకహోదా అనే అంశాన్ని ఆయన తన ఆలోచనలలో నుండి ఎప్పుడో తీసేసాడు. ఇప్పుడు బడ్జెట్‌లో ఏపికి నిధులివ్వలేదని ఏడుస్తున్నాడేగాని ప్రత్యేకహోదా గురించి మాట్లాడడం లేదు.

ఇంకో పక్క చంద్రబాబు సైగలతో పనిచేసే పవన్‌కళ్యాణ్‌ జేఏసీ అంటూ వాళ్ళు వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయనది ప్రత్యేకహోదా పోరాటమో, ఇంకెవరి కోసమన్నా ఆరాటమో అర్ధం కావడం లేదు. ఆయన భవిష్యత్‌ కార్యా చరణ ప్రణాళిక ఏంటో కూడా తెలియదు. ఒకవేళ ఆయనకన్నా తెలుసోలేదో? వామపక్షాల వాళ్ళు మాత్రం మొదటినుండి ఏపికి ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధితో వున్నారు. ఇప్పుడు వైకాపా నాయకత్వంలో వాళ్ళు కూడా ప్రత్యేకహోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసే అవకాశముంది.

మొత్తానికి జగన్‌ కొట్టిన దెబ్బకు చంద్రబాబుకు మైండ్‌ బ్లాక్‌ అయ్యుండాలి. ఆయన అటు తెగించి కేంద్రంతో పోరాడ లేడు... ఇటు చేతులు కట్టుకుని జనం మధ్య పలుచన కాలేడు. ప్రత్యేకహోదా కోసం నోరు తెరవలేని పరిస్థితి. జగన్‌ మాత్రం ప్రత్యేకహోదా కోసమే ప్రత్యేకంగా పట్టుబట్టి ఉద్యమానికి పిలుపునివ్వడంతో రాష్ట్ర ప్రజలలో సైతం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రత్యేకహోదాపై ఇక రాజీ లేని పోరు సాగిస్తే... జగన్‌కు చెల గాటం... బాబుకు సంకటమే! హోదాపై అసలైన గేమ్‌ ఇప్పుడే మొదలైంది...!

jagan 1000పల్లె హృదయాలను తాకుతూ, పల్లె వాసనలు పీలుస్తూ, పల్లెవాసుల ఆత్మీయ పలకరింపుతో పులకరిస్తూ వైకాపా అధినేత వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర నెల్లూరు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది.

ఆరోజు ఈరోజు అని లేకుండా ప్రతిరోజూ జన హారతులతో, జయజయ ధ్వానాలతో జగన్‌ పాదయాత్ర పరుగులు పెడుతోంది. ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం... ఆరు నెలలు... మూడు వేల కిలోమీటర్లు... ఈ చారిత్రాత్మక పాదయాత్రలో మొదటి వెయ్యి కిలోమీటర్ల మైలురాయికి నెల్లూరుజిల్లానే వేదికయ్యింది. వైసిపి అభిమానులకు ఇదో వేడుకయ్యింది. జనవరి 29వ తేదీన వై.యస్‌.జగన్‌ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లను అధిగమించింది. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని సైదాపురంలో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను వేలాదిమంది జనసందోహం నడుమ జగన్‌ ఆవిష్కరించాడు. జగన్‌ పాదయాత్ర ఆరోజు వెయ్యి కిలోమీటర్లకు చేరుకుంటున్న సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో, అన్ని మండలాల నుండి వైసిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పోటెత్తి రావడంతో సైదాపురం జనసంద్రమైపోయింది.

జనవరి 23వ తేదీన పెళ్ళకూరు మండలం పునబాక వద్ద జిల్లాలోకి జగన్‌ పాద యాత్ర ప్రవేశించింది. నాయుడుపేట, ఓజిలి, గూడూరు, సైదాపురం మండలాల మీదుగా సాగి బుధవారం మధ్యాహ్నంకు పొదలకూరుకు చేరుకుంది. జగన్‌ పర్యటన ఇంకా నెల్లూరురూరల్‌, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాలలో మిగిలివుంది. ఇప్పటివరకు జగన్‌ పాదయాత్రకు జనం ఇసుకేస్తే రాలనంతగా వస్తున్నారు. జిల్లాలో జగన్‌కు వస్తున్న స్పందన చూసి చంద్రబాబుకు గుబులు పట్టుకుంది. జిల్లాలో వైకాపా బలం పుంజుకుందన్న సంకేతాలు, తన పార్టీలో సన్వయం లేదన్న సమాచారంతో చంద్రబాబు తన పార్టీ నాయకులపైనే కారాలు మిరియాలు నూరుతున్నట్లు సమాచారం.

ys jaganఅధికారపార్టీ ఎప్పుడు తప్పు చేస్తుందా? ఎక్కడ దొరుకుతుందా? అని ప్రతిపక్షం అనుక్షణం కాపు కాయాలి. అధికార పార్టీ చేసే తప్పులను శాసనసభ వేదికగా కడిగిపారేయాలి. అధికారంలో వున్న వాళ్ళ అక్రమాలను ప్రజల ముందు ఎత్తిచూపి వారిని దోషులుగా నిలబెట్టాలి. ప్రతిపక్ష నాయకుడి బాధ్యత అది. ప్రతిపక్షనేతలు ప్రజాదరణ పొందేది అక్కడే! అంతేగాని ప్రతిపక్ష నేతే తప్పటడుగులు వేసి అధికారపార్టీకి వాళ్ళే ఆయుధం అందించడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది.

ఏ.పి ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డికి ఎవరు ఉచిత సలహాలిస్తున్నారోగాని తప్పటడుగుల పరంపర కొనసాగుతూనే వుంది. శాసనసభ అన్నది ప్రజాసమస్యలను చర్చించే వేదిక. పరిపాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ అధికార పార్టీని ప్రశ్నలతో ఆడుకునే వేడుక. అసెంబ్లీ సమావేశాలంటే అధికారపార్టీ వణకాలి. ప్రతిపక్షం ఉరకాలి. ప్రతిపక్షం దెబ్బకు అధికార పార్టీ నాయకుల పంచెలు తడవాలి. సభలో పరిస్థితులు ప్రతిపక్షానికి చెలగాటంగానూ, ప్రభుత్వానికి ప్రాణ సంకటంగానూ మారు తుంటాయి. అలాంటి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని ప్రకటించడం ద్వారా ప్రతిపక్ష నేత చేతిలో వున్న వజ్రాయుధాన్ని వదులుకున్నాడని పిస్తోంది. ఈనెల 10వ తేదీ నుండి జరిగే శాసనసభ సమావేశాలను బహిష్కరించా లని ప్రతిపక్ష వైకాపా నిర్ణయించింది. దీంతో శాసనసభ పక్ష సమావేశాలు ఏక పక్షంగా, అధికారపార్టీ భజన కార్యక్ర మంగా ముగియబోతున్నాయి.

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించ డానికి వైకాపా చూపిన ప్రధాన కారణం తెలుగుదేశంలో చేరిన తమ పార్టీ ఎమ్మె ల్యేలు 21మందిపైన చర్యలు తీసుకోక పోవడం వల్లేనని. రాజకీయాలలో విలు వలు పాటించేవాళ్ళు ఒక పార్టీలో గెలిచి, ఇంకో పార్టీలోకి వెళుతున్నప్పుడు వున్న పదవులకు రాజీనామా చేస్తారు. మొన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి శిల్పా చక్రపాణిరెడ్డి వైసిపిలో చేరినా, నిన్న రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినా విలువలు పాటించినవాళ్ళే! వైసిపి నుండి 21మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరితే ఒక్క రంటే ఒక్కరు కూడా విలువలకు కట్టుబడి రాజీనామా చేయలేదు. దేశమంతా ఈ అన్యాయం చూస్తూనే వుంది. అయినా ప్రశ్నించేవారు లేరు. అయితే దీనిని శాసన సభా వేదిక మీదే తేల్చుకోవాలి. అక్కడే ఈ విలువలు లేని వ్యవహారాన్ని ఎత్తి చూపాలి. ఎందుకంటే అధికారపార్టీకి, ప్రతిపక్ష పార్టీకి రెండు చోట్ల మాత్రమే ప్రత్యక్ష పోరాటం జరుగుతుంది. ఒకటి ఎన్నికల రణ క్షేత్రంలో, రెండోది శాసనసభ కురుక్షేత్రంలో! అధికారపక్షానికి ఎదురు నిలిచి ప్రశ్నించగలిగేది, వారి లోపాలను ప్రజల ముందు వేలెత్తి చూపగలిగేది. ప్రజాసమస్యలపై తమ గళాన్ని వినిపించ గలిగేది అసెంబ్లీలోనే! కాబట్టి అసెంబ్లీలో మాట్లాడే, పోట్లాడే అవకాశాన్ని జగన్‌ వదులుకుని ఉండకూడదు.

ఈ మూడున్నరేళ్ళలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసాము. ఈసారి ఉన్న గలీజు అసెంబ్లీ ఎప్పుడూ చూడలేదు. గతంలో ప్రభుత్వాలు కాని, స్పీకర్‌ గాని ప్రతిపక్షానికి సముచిత ప్రాధాన్యత, గౌరవం ఇచ్చేవాళ్ళు. కాని ఈ ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు మరీ దిగజారి నట్లుగా జరగుతున్నాయి. అనుభవం, అర్హత లేనివాళ్ళు ఎమ్మెల్యేలై అనవసరపు రంకెలు వేస్తూ సభను ఛండాలం చేస్తున్నారు. రౌడీలు, గూండాలను తలపించేలా వారి మాటలుంటున్నాయి. ఒకరిపట్ల ఒకరికి గౌరవ ప్రదమైన సంభాషణలే కరువ య్యాయి. ఇంతటి దారుణస్థితిలో వున్న శాసనసభ సమావేశాలలో కూడా ప్రతి పక్షనేతగా వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ఎంతో చక్కగా రాణించాడు. పలు అంశాలపై, పలు సమస్యలపై పూర్తి సమాచారంతో ప్రభుత్వాన్ని ఆయన ఏకిపారేస్తున్న తీరుకు ప్రజలు ముగ్దులౌతున్నారు. అసెంబ్లీ సమావేశాలలో అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతగా రంకెలు వేసి రెచ్చ గొట్టినా సహనం కోల్పోకుండా, సంయ మనం పాటిస్తూ, ప్రజాసమస్యలపై ఘాటుగా స్పందిస్తున్న నేతగా అసెంబ్లీ వేదిక ద్వారానే జగన్‌కు పేరొచ్చింది. అలాంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదనుకోవడం ఖచ్చితంగా అల వాటులో పొరపాటేననుకోవాలి.

ఇప్పుడైతే ప్రతిపక్షం చేతిలో ఎన్నో అస్త్రాలున్నాయి. మూడున్నరేళ్ళ నుండి అమరావతి రాజధాని అని సినిమాలు చూపిస్తున్నారే గాని, ఒక్క అడుగు ముందుకు పడలేదు. రాజధాని డిజైన్‌లు అంటూ సినీ డైరెక్టర్లను వెంటబెట్టుకుని ఇంకా విదేశాలు తిరుగుతున్నారు. రాజధాని కోసమంటూ 35వేల ఎకరాల భూములను సేకరించి రైతులను బికారులుగా మార్చి పొలాలను బీళ్ళుగా పెట్టి వారి బ్రతుకులను ప్రశ్నా ర్థకం చేశారు. పోలంవరం అంచనాలు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ దానిని ఎప్పటికి పూర్తవుతుందో తెలియని ప్రాజె క్టుగా మార్చారు. కార్పొరేట్‌ కాలేజీలలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. అధికారులపై వేధింపులతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఉపాధిహామీలు అటకెక్కాయి. నిరుద్యోగభృతి లేదు. ఋణమాఫీ అస్తవ్యస్తంగా ఉంది. డ్వాక్రా మహిళల హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. కాపుల బీసీ రిజర్వేషన్‌ హామీ ఆచరణ రూపం దాల్చలేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అధికారపార్టీ ఆగడాలు, అరాచ కాలు ఎక్కువుగా వున్నాయి. ఇంకా ప్రభుత్వ వైఫల్యాలు చాలానే ప్రస్తావించడానికి అసెంబ్లీని వేదికగా మార్చుకుని ఉండొచ్చు. ఇలాంటి కీలక సమయంలో జగన్‌ అసెం బ్లీని బహిష్కరించడమంటే అది తెలిసీ వేసిన తప్పటడుగా? లేక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యకు ఇంక ఏ దారీలేని పరిస్థితుల్లో తప్పకవేసిన అడుగా? జగన్‌కే తెలియాలి?

Page 1 of 3

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • రెండు నెలల్లో... ట్రెండ్‌ మారింది
  రాజకీయాలలో పరిస్థితులు తారుమారు కావడానికి ఎంతో కాలం పట్టదు. నాలుగేళ్ళ పదినెలలు సమర్ధవం తంగా పని చేసిన ఒక ప్రభుత్వం ఒక చిన్న తప్పు చేస్తే ఒక్క నెలలోనే గబ్బు పట్టొచ్చు. దాని మూలంగానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. నాలుగేళ్ళ పది నెలల…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…

Newsletter