jaganరాష్ట్రంలో తెలుగుదేశం నాయకులకు ఇంత కాలం ఒక ఆశ ఉండేది. అక్రమాస్తుల కేసుల్లో వైకాపా అధినేత జగన్‌ జైలుకుపోతాడని, రాష్ట్ర రాజకీయాలలో ఇక తమకు తిరుగుండదని భావిస్తూ వచ్చారు. కాని, ఇప్పుడు వారి ఆశలకు నెమ్మదిగా తెరపడబోతోందని తెలుస్తోంది.

రాష్ట్రంలో తెలుగుదేశంను, చంద్ర బాబు నాయకత్వాన్ని చేవగా ఢీకొంటున్న నాయకుడు జగన్‌! రాష్ట్రంలో కాంగ్రెస్‌ పతనమైపోయింది. బీజేపీకి గాని, ఇతర పార్టీలకు గాని అంత చేవలేదు. సొం తంగా ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి నడిపే దమ్ము ధైర్యం కూడా ఈ కాలంలో ఎవరికీ లేదు. చంద్రబాబు కూడా ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీని లాక్కుని ఒకటికి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడుగాని, సొంతంగా పార్టీని స్థాపించి సీఎం అయ్యే సీన్‌ లేదు.

రాష్ట్ర రాజకీయాలలో ఇంతవరకు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశమే బలమైన పార్టీ. ఎన్టీఆర్‌కు సినీ గ్లామర్‌ వుంది, 300కుపైగా సినిమా లలో నటించాడు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రజలకు విరక్తి కలిగి వుండింది. కాబట్టి ఎన్టీఆర్‌ తెలుగుదేశం ప్రభంజనం సృష్టించగలిగింది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్‌ తర్వాత ఒక ప్రాంతీయపార్టీని స్థాపించి సినిమా గ్లామర్‌ లేకున్నా, రాజకీయ అనుభవం లేకున్నా రాష్ట్ర శాసనసభలో 70అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నది జగన్‌ స్థాపించిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీయే! ఎన్టీఆర్‌ తెలుగుదేశం 275 అసెంబ్లీలున్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో బలమైన ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవిస్తే, జగన్‌ వైసిపి రాష్ట్ర విభజన తర్వాత 175 సీట్లు మాత్రమే వున్న ఆంధ్ర ప్రదేశ్‌లో 70సీట్లు తెచ్చుకోగలిగింది. కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో అధికా రానికి దూరమైంది. డబ్బు, గ్లామర్‌ లేనిదే పార్టీలను నడపడం కష్టమైన ఈ కాలంలో జగన్‌ స్థాపించిన వైసిపి బలీయ శక్తిగా ఎదగడం తెలుగుదేశం శ్రేణులకు నిద్ర లేకుండా చేసింది. వైసిపిని బలహీన పర చడం వారికి సాధ్యం కావడం లేదు. లక్ష కోట్లు తిన్నాడని జగన్‌ మీద ఎన్ని ఆరోప ణలు చేసినా జనం నమ్మడం లేదు, సరి కదా అతనికి నీరాజనాలు పడుతున్నారు. రాజకీయంగా జగన్‌ చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు.

జగన్‌ను రాజకీయంగా అణచడానికి తెలుగుదేశం వద్ద సొంత ఆయుధాలేమీ లేవు. వాళ్లు ఇంతకాలం న్యాయస్థానా లలో జగన్‌పై వున్న కేసులను నమ్ముతూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో జగన్‌ పై వున్న కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతు న్నాయి. ఈ కేసులతో సంబంధం వున్న ఐఏఎస్‌ అధికారులు శ్రీలక్ష్మి, బి.పి. ఆచార్య, శ్యాంబాబు... ఇలా అందరూ కేసుల నుండి బంధవిముక్తులవుతున్నారు. ఈ కేసుల్లో అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించారని తేలితే జగన్‌ను దోషిగా చూపించలేరు. జగన్‌ మీద పెట్టిన కేసుల్లో చాలా వరకు క్లియరయ్యాయి. ఇక కొద్ది కేసులు మాత్రమే పెండింగ్‌లో వున్నాయి. వాటిల్లో కూడా జగన్‌కు క్లీన్‌చిట్‌ లభిస్తే చంద్రబాబు లక్షకోట్ల ప్రచారం ఉత్తదే అవుతుంది. జగన్‌ను వేలెత్తి చూప డానికి దారులు మూసుకుపోతాయి.

జగన్‌ మీద కేసులన్నవి రాజకీయ కోణంలో పుట్టినవే! అతను కాంగ్రెస్‌ నుండి బయటకొచ్చి వైసిపిని స్థాపించాకే అప్పుడు యూపిఏ అధినేత్రి సోనియాగాంధీ ప్రేర ణతో జగన్‌పై కేసులు పడ్డాయి. పగబట్టి జగన్‌ను జైలుకు పంపించడమే కాకుండా 16నెలలు బెయిల్‌ రాకుండా చేసారు. ఇంత చేసినా కూడా జగన్‌ రాజీపడకుండా అటు కాంగ్రెస్‌తో, ఇటు రాష్ట్రంలో టీడీపీతో పోరు మార్గాన్నే ఎంచుకున్నాడు. ప్రతికూల పరిస్థితులను ఎదిరించి మొం డిగా నిలబడ్డాడు. వైసిపి కేడర్‌ను ఇంత కాలం కేసుల భయమే వెంటాడుతోంది. జగన్‌ ఈ కేసుల్లో జైలుకు వెళితే పార్టీకి ప్రత్యామ్నాయ నాయకత్వమే లేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వీగిపోతున్న కేసులతో వైసిపి కేడర్‌కు ఎనలేని ఉత్సాహం వస్తోంది.

అదే సమయంలో చంద్రబాబును మాత్రం ఓటు - నోటు కేసు నీడలా వెంటా డుతోంది. ఇటీవల కేంద్రంలోని బీజేపీ నాయకత్వం రాష్ట్ర రాజకీయాలపై తమ వ్యూహాలను మార్చుకుంటూ వస్తోంది. రేపటి ఎన్నికల్లో ఎవరితో జతకడతారో చెప్పలేని పరిస్థితి. రాజకీయంగా చంద్ర బాబును తొక్కాలని భావిస్తే మాత్రం 'ఓటు-నోటు' కేసుకు ప్రాణప్రతిష్ట జరిగే అవకాశముంది. అదే జరిగితే తెలుగుదేశం పరిస్థితి... బాలకృష్ణ బాషలో చెప్పినట్లుగా దిబ్బిడిదబ్బిడే..!

pkజగన్‌ అంటే జనంలో అపార అభిమానముంది. వై.యస్‌. కుటుంబంతో తెలుగు లోగిళ్ళకు అపురూప అనుబంధముంది. ''రాజన్న''న్నా ఆయన కుమారుడన్నా ప్రాణాలిచ్చే అభిమానులు తెలుగు నాటంతా వున్నారు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా రాజశేఖరరెడ్డి కోసం ఆయన కుటుంబం కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌పార్టీకి సిద్ధంగా వున్నారు. కదన రంగంలో ప్రాణాలొడ్డి పోరాడే సైనికుల్లా కార్యకర్తలుంటే వాళ్ళకి దశాదిశా నిర్ధేశించి ముందుకు నడిపించే మేజర్లలా నాయకులున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే. అందరి ధ్యేయం ఒక్కటే. అందరి ఆశ, ఆశయం, ఆకాంక్ష ఒక్కటే! 2019లో వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలి. ''రాజన్న'' ఆత్మకు నిజమైన శాంతిని చేకూర్చాలి. మరి ఇలాంటి తరుణంలో ఎవరో కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చి ఆయన మార్గదర్శకంలో పార్టీని గెలి పించుకుందాం అని పిలుపునివ్వడం సబబు కాదు.

1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావుకు ఎవరు వ్యూహకర్తలుగా పని చేశారు? ఎవరి సలహాలు లేకుండానే ఆయన ప్రజా ప్రభంజనం సృష్టించలేదా? 1989లో ఎటువంటి రాజకీయ వ్యూహకర్తలు లేకుండానే, కనీసం సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించకుండానే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాలేదా? 2004లో ఎవరి వ్యూహాలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది? వ్యూహకర్తలతో విజయం లభించిందా? లేక వై.యస్‌. ఇమేజ్‌తో పార్టీ గెలిచిందా? అంతెం దుకు 2014 ఎన్నికల్లో తన సొంత వ్యూహాలతోనే చంద్రబాబు అధికారంలోకి రాలేదా?

గెలుపు అన్నది ఆ బ్రహ్మ వ్రాసి వుండాలి, లేదా ప్రజలు వ్రాయాలి. లేదంటే మన సొంత కృషితో మనమే తిరగరాయాలి. అంతేగాని, మన పార్టీ గెలుపు కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశించడం కరెక్ట్‌ కాదు. ఇప్పుడు దేశమంతటా ఎన్నికలొస్తే ప్రధానంగా వినిపిస్తున్న పేరు ప్రశాంత్‌ కిషోర్‌(పీకే). 2014 ఎన్నికల్లో బీజేపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించాడు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి మోడీ ప్రధాని అయ్యారు. అలాగే ఆ తర్వాత బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నితీష్‌కుమార్‌కు ఆయన వ్యూహకర్తగా పనిచేశాడు. ఆ ఎన్నికలలోనూ దళ్‌(యూ) ఆర్జేడీ కూటమి ఘనవిజయం సాధించాయి. దీంతో ప్రశాంత్‌ కిషోర్‌ పేరు మార్మోగిపోయింది. అయితే ఇక్కడ ఆలోచించా ల్సింది... ప్రశాంత్‌ కిషోర్‌ సహకారం లేకపోయి వుంటే 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవదా? బీహార్‌లో దళ్‌(యూ) గెల వదా? ఎవరున్నా లేకున్నా లోక్‌సభలో బీజేపీ గెలుపును, బీహార్‌లో నితీష్‌ గెలుపును ఎవరూ ఆపగలిగేవారు కారు. ఎందుకంటే యూపిఏ ప్రభుత్వాన్ని దించేయాలని ప్రజలు డిసైడైపోయారు. ప్రశాంత్‌కిషోర్‌ లేకున్నా, ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించక పోయి వున్నా ఆ ఎన్నికల్లో అధికారం ఎన్డీఏదే! కాకపోతే మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంవల్ల అధికారం బీజేపీది అయ్యింది. బీహార్‌లోనూ అంతే! నితీష్‌కుమార్‌పై ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఆయన సమర్ధుడైన ముఖ్యమంత్రి. బీహార్‌ను అభివృద్ధి బాట పట్టించాడు. దానికితోడు బలమైన ఓటు బ్యాంకున్న ఆర్జేడీతో పొత్తు వుంది. ఆ ఎన్నికల్లో ప్రత్యర్థిగా వున్న బీజేపీ సమర్ధుడైన సీఎం అభ్యర్థిని చూపలేకపోయింది. మరి బీహార్‌ ప్రజలు నితీష్‌ను కాక ఇంకెవరిని గెలిపిస్తారు? మరి ప్రశాంత్‌కిషోర్‌ రాజకీయ వ్యూహాలు అంత బాగా పనిచేస్తే మొన్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అధికారంలో వున్న సమాజ్‌ వాది పార్టీ ఎందుకు చతికిలపడింది. ఏ పార్టీ వాళ్లయినా రాజకీయ వ్యూహకర్తలను పెట్టుకోవడంలో తప్పులేదు. అయితే అది పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితం కావాలి. ఒక పార్టీ విజయంలో పార్టీ అధినేత నుండి నియోజకవర్గ స్థాయి నాయకులు మొదలుకొని బూత్‌ స్థాయి కార్యకర్తల వరకు అందరికృషి ఉంటుంది. ఏ పార్టీ గెలుపులో అయినా మొదటి భాగస్వాములు కార్యకర్తలే! అంతేగాని, ప్రశాంత్‌ కిషోర్‌ లాంటి వ్యూహకర్తలు కాదు. వ్యూహకర్తలే పార్టీలను అధికారంలోకి తెచ్చే టట్లుంటే భారత రాజకీయ వ్యవస్థను ఇక వాళ్లే శాసించగలరు.

వైకాపా అధ్యక్షుడు జగన్‌, ప్రశాంత్‌కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకుని వుండొచ్చు. కాని అది పార్టీ అంతర్గత సమా వేశాలకే పరిమితమై వుండాలి. అంతేగాని ప్లీనరీ వంటి బహిరంగ వేదికలనెక్కించి, ఆయన పుణ్యాన ఇక మనం అధికారంలోకి రానున్నాం అన్నట్లు మాట్లాడకూడదు. ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు ప్రశాంత్‌కిషోర్‌ కంటే జగన్‌కే ఎక్కువ తెలిసుండాలి. ప్రజాసమస్యలపై జగన్‌ స్పందించాలి. వైకాపాకు వేలసంఖ్యలో నాయకులు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు, కోట్ల సంఖ్యలో ప్రజలు మద్దతుగా వున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా వుంది. ఈ అవకాశాలను అనుకూలంగా మలచుకోవాలి. 2004లో ఎలాంటి ప్రశాంత్‌ కిషోర్‌లు లేకుండానే చంద్రబాబు ప్రభుత్వాన్ని మట్టికరిపించాడు వై.యస్‌.రాజశేఖరరెడ్డి. ఇప్పుడు కావలసింది వ్యూహకర్తలు కాదు, సమన్వయకర్తలు. రాజకీయాలతో సంబంధం లేని వై.యస్‌. కుటుంబ ఆప్తులను జగన్‌ 13జిల్లాల్లో సమన్వయకర్తలుగా పెట్టుకోవాలి. ఇతరులతో సంబంధం లేకుండా ఆ సమన్వయకర్తలతో నేరుగా జగన్‌ సంబంధాలు పెట్టుకోవాలి. గ్రామస్థాయి నుండి ఎక్కడ ఏ లోపాలున్నా వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి జిల్లాలోనూ మారుతున్న సమీకరణలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయగలిగే నిస్వార్ధ వ్యక్తిగత వ్యక్తులని ఆయన 13జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవాలి. గతంలో వై.యస్‌. చేసింది కూడా ఇదే. ఎక్కడ సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లినా వెంటనే స్పందించేవాడు. ఇందుకు ఎన్నో ఉదా హరణలు ''లాయర్‌'' వద్దనే ఉన్నాయి.

''ప్రజలే దేవుళ్ళు... సమాజమే దేవాలయం'' అన్న రామా రావు సిద్ధాంతాన్నే వై.యస్‌. కూడా నమ్మాడు. అందుకే నేరుగా ప్రజల్లోనే మమేకమయ్యాడు. ఎక్కడేం జరుగుతుందో తన ఆంతరంగిక వ్యక్తుల ద్వారా తెలుసుకునేవాడు. ఎక్కడైనా సమస్య ఉంటే పరిష్కరించి పరిస్థితిని తనకు అనుకూలంగా మలచు కునేవాడు. మన రాష్ట్రం గురించి, మన ప్రజల సమస్యల గురించి మనకు అవగాహన వుంటే చాలు, వాటిని పరిష్కరిస్తామని మనం ప్రజలకు నమ్మకం ఇవ్వగలిగితే చాలు... ఎలాంటి ప్రశాంత్‌ కిషోర్‌ల అవసరం లేకుండానే విజయం సొంతమవుతుంది.

jaganగతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి.

ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు జరిగేవి. అయితే అక్కడ దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి సమాధి ఉండడం తప్ప ఆ ప్రాం తంలో ఇంకెటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. కాని, ఈసారి ప్లీనరీకి గుంటూరును ఎంచుకుని రాజకీయ వ్యూహాత్మకంగా ముందడుగు వేసాడు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి. కొంతకాలం క్రితమే విశాఖ కేంద్రంగా తెలుగుదేశంపార్టీ వాళ్లు నిర్వహించిన మహానాడుకు, నిన్న జరిగిన వైసిపి ప్లీనరీకి తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది. మహా నాడులో అధికార ఆర్భాటం స్పష్టంగా కనిపిస్తే, వైసిపి ప్లీనరీలో మాత్రం పార్టీపై అభిమానం, ప్రభుత్వం పట్ల వున్న వ్యతిరేకత స్పష్టమైంది.

గుంటూరు ప్లీనరీని ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి చక్కని రాజకీయ వేదికగా మలచుకున్నాడు. భవిష్యత్‌ కార్యా చరణ ప్రణాళికను స్పష్టంగానే ప్రకటించ గలిగాడు. రాష్ట్రంలో మూడేళ్ల చంద్ర బాబు పాలనను ఎండగట్టడం లోనే కాదు, తాము అధికా రంలోకి వస్తే ఏం చేస్తామన్నది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ప్లీనరీలో తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలకే గురిపెట్టి జగన్‌ కొత్త పథకాలను ప్రకటించాడు. ఎన్నికలు ఇంకా దాదాపు రెండేళ్ల దూరంలో వున్నాయి. ఇప్పుడే ఆయన వరాలు, పథకాలు ప్రకటించాల్సిన అవసరం లేదు. కాని, రేపు జరగబోయే నంద్యాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జగన్‌ వీటిని ప్రకటించాడనిపిస్తుంది. ముఖ్యంగా రైతులను లక్ష్యంగా చేసుకున్నాడు. 5ఎకరాల లోపున్న రైతులకు సంవత్సరానికి 50వేల సాయం ప్రకటించడం రాజకీయంగా పార్టీకి ఎంతో ప్రయోజనం కలిగించేదే! తెలుగుదేశం ప్రభుత్వంలో రైతాంగం పూర్తి నిరాశకు లోనైంది. చంద్రబాబు ఋణమాఫీ వాగ్ధానం అరకొరగానే అమలైంది. పాత ఋణాలు పూర్తి స్థాయిలో మాఫీ కాకపోగా, రైతులకు బ్యాంకులు కొత్తగా అప్పులివ్వడం లేదు. సాగునీళ్ళ సమస్య... గిట్టుబాటు ధరల సమస్య... విత్తనాలు, ఎరువుల సమస్య... ఇలా నిత్యం సమస్యలతో పోరాడుతున్న రైతులకు జగన్‌ రైతు భరోసా పథకం కొత్త ఆశలు కల్పించేదే!

ఇక మూడు దశలలో మద్య నిషేధాన్ని అమలు చేస్తానన్న జగన్‌ ప్రకటన మహిళా లోకాన్ని విశేషంగా ఆకర్షించేదే! రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే! 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు విడతల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పాడు. కాని, అధికారంలోకి వచ్చాక దశలవారీగా మద్యాన్ని విస్తరింపజేశాడు. ఈరోజు 30వేల జనాభా వున్న గ్రామాల్లో కూడా బార్లు పెట్టిస్తానంటున్నాడు. మద్యం విషయంలో చంద్రబాబు ప్రభుత్వంపై మహిళల్లో బలంగానే వ్యతిరేకత వుంది. ఈ అంశాలపై జగన్‌ గురిపెట్టి కొట్టాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, అమ్మబడి, పింఛన్‌లు వంటివి వై.యస్‌. హయాంలో మొదలుపెట్టి అమలు చేస్తున్నవే!

అయితే ఇక్కడ నాయకుల విశ్వసనీయత ముఖ్యం. చంద్రబాబు ఆడిన మాటమీద నిలబడడన్నది జనానికి అర్ధమైపోయింది. ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత లేదు. కాని విశ్వసనీయతకు బ్రాండ్‌ వై.యస్‌. కుటుంబం. 2004 ఎన్నికల్లో ప్రజలకు చెప్పిన వాగ్ధానాలన్నింటిని నెరవేర్చి చూపించాడు వై.యస్‌. ఆయన కొడుకుగా జగన్‌ పట్ల కూడా ప్రజల్లో అదే విశ్వసనీయత వుంది.

ప్లీనరీ వేదికగా జగన్‌ తీసుకున్న సాహసోపేత నిర్ణయం 3వేల కిలోమీటర్ల పాదయాత్ర. అక్టోబర్‌ 27న ఇడుపులపాయలో మొదలుపెట్టి ఇచ్ఛాపురం దాకా 13జిల్లాల్లో 6 నెలల పాటు పాదయాత్ర చేయాలని సంకల్పించడం జగన్‌ పట్టుదలకు నిదర్శనం. జనంలో నిలిచేవాడు, జనంతో నడిచేవాడే నాయకుడు. 2002లో మండుటెండల్లో చేవెళ్ల నుండి ఇచ్ఛాపురం దాకా 1,472 కిలోమీటర్లు దివంగత నేత వై.యస్‌.రాజ శేఖర్‌రెడ్డి నిర్వహించిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆ పాదయాత్రలో ప్రత్యక్షంగా ప్రజల కష్టాలను, కన్నీళ్లను చూడబట్టే సీఎంగా బాధ్యతను చేపట్టిన వై.యస్‌. ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. నాటి తండ్రి పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకునే జగన్‌ 3వేల కిలోమీటర్ల పాదయాత్రకు నడుం కట్టాడు.

మొత్తానికి గుంటూరు ప్లీనరీ వైకాపా శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. భవిష్యత్‌పై బలమైన ఆశలకు పునాది వేసింది. వచ్చే ఎన్నికల్లో గట్టిగా పోరాడడానికి పార్టీ కేడర్‌కు సరికొత్త శక్తినిచ్చింది.

Page 1 of 17

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
    గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
    చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
  • ఓటమి నేర్పిన పాఠమేంటి?
    గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
  • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter